Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలురాజ్యసభలో ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రధాని కౌంటర్

రాజ్యసభలో ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రధాని కౌంటర్

పదేళ్ల ఎన్డీఏ పాలన పూర్తి.. మరో 20 ఏళ్ల పాలన మిగిలే ఉందన్న మోదీ

ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభలో తిప్పికొట్టారు. తమది 1/3 ప్రభుత్వమంటూ ప్రతిపక్షాలు అంటున్నాయని.. వారి మాట నిజమేనంటూ ఇప్పటికి కేవలం పదేళ్ల పాలన మాత్రమే పూర్తయిందని, మరో ఇరవై ఏళ్లు మిగిలే ఉన్నాయని రిటార్ట్ ఇచ్చారు. పరోక్షంగా మమ్మల్ని మరో ఇరవై ఏళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నందుకు ప్రతిపక్షాలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ప్రతిపక్ష నేతల మాటలు నిజం కావాలని కోరుకుంటున్నట్లు మోదీ తెలిపారు. ఈమేరకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. రాజ్యాంగం గొప్పదనాన్ని కీర్తిస్తూ.. అంబేద్కర్ రాజ్యాంగం వల్లే తాను ఇప్పుడు ఇక్కడ మాట్లాడగలుగుతున్నానని చెప్పారు.
ఉభయ సభలలో కొంతమంది సభ్యులు రాజ్యాంగ ప్రతులను చేతులెత్తి ప్రదర్శిస్తున్నారని, అయితే, వారే రాజ్యాంగాన్ని వ్యతిరేకించారని చరిత్ర చెబుతోందన్నారు. దీనిపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆయన అబద్ధాలు చెబుతూ పోతుంటే అడ్డుకోకుండా మీరు అనుమతిస్తున్నారు’ అంటూ చైర్మన్ జగ్ దీప్ ధన్కడ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఎన్డీఏ పదేళ్ల పాలన కేవలం అపెటైజర్ (భోజనానికి ముందు తీసుకునే ఆకలిని పుట్టించే పదార్థాలు) మాత్రమేనని మెయిన్ కోర్సు (భోజనం) ఇప్పుడే మొదలైందని అన్నారు. రాబోయే ఐదేళ్లలో మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామని, ప్రజా సంక్షేమమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు. సభలో ప్రతిపక్షాల నినాదాల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలంటూ ఇండియా కూటమి ఎంపీలు నినాదాలు చేశారు. అయినప్పటికీ చైర్మన్ తమ విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో నిరసన వ్యక్తం చేస్తూ వాకౌట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article