పారదర్శకమైన ఓటర్ల జాబితాను రూపొందించాం
పులివెందుల టౌన్ :నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పారదర్శక ఓటరు జాబితాను రూపొందించామని ఈఆర్వో, ఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం ఆర్డిఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏవైనా అభ్యంతరాలు అందితే ఎప్పటికప్పుడు జాబితా సవరించడం జరుగుతోందని అన్నారు. నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాపై, ఎన్నికల సన్నద్ధతకు చేపట్టిన చర్యలను వివరించారు. ఈ ఏడాది జనవరి 22వ తేదీన ఓటర్ల తుది జాబితా ముసాయిదా విడుదల చేయడం జరిగిందన్నారు. పులివెందుల అసెంబ్లీ (129) నియోజకవర్గానికి సంబంధించి 301 పోలింగ్ స్టేషన్ల తుది జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు సమాచారం అందించడం జరిగిందన్నారు. ఈ తుది జాబితా (ఎలక్టోరల్ రోల్ ప్రత్యేక సవరణ 2024)లో 110829 మంది పురుష ఓటర్లు, 1,16,605మంది మహిళల ఓటర్లు, 19 మంది ట్యాడ్ జెండర్స్ఓటర్లు కలిపి.. మొత్తం 2,27,453మంది ఓటర్లుగా ఉన్నారన్నారు. అలాగే నియోజకవర్గంలో 403 సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు.ఫైనల్ పబ్లికేషన్ 22-01-2024 ప్రచురణ ప్రకారం మొత్తం చేర్పులు 7,811 కాగా తొలగించిన ఓటర్లు 5,735 గా నమోదయ్యాయన్నారు.
తుది జాబితా ప్రకటించిన అనంతరం పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి 10.02.2024 వరకు.. ఫారం-6 (1003), ఫారం-7 (347), ఫారం-8 (1185) మొత్తం 2535 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయన్నారు. వీటిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో సంబంధిత ఫారంలో, ఆన్లైన్ ద్వారా అందే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో పులివెందుల తహశీల్దార్ రమేష్ బాబు, ఎలక్షన్ డీటీ జగదీష్, తదితరులు పాల్గొన్నారు.