ప్రజాభూమి ప్రతినిధి,హైదరాబాద్‌ః
తెలంగాణలో సమ్మర్ హీట్ పెద్దగా కనిపించకపోయినా పొలిటికల్ హీట్ మాత్రం రోజురోజుకు తీవ్రమవుతోంది. ముఖ్యంగా 2024 ఎన్నికలే టార్గెట్‌గా ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.ఇక ఇప్పటికే రాహుల్‌గాంధీ ద్వారా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్… ఈసారి యూత్ డిక్లరేషన్‌ను ప్రకటించబోతోంది. ఇందుకోసం ఈనెల 8న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో మధ్యాహ్నం 3గంటలకు యువ సంఘర్షణ సభను నిర్వహిస్తోంది. ఈసభకు కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంకగాంధీ హాజరై డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని లక్షలాది మంది విద్యార్ధులు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారికోసం ఏం చేస్తామో చెప్పేందుకే యూత్ డిక్లరేషన్ ప్రకటిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.మే8న జరిగే ఈ యూత్ డిక్లరేషన్ సభకు రాష్ట్రంలో ఉన్న 20లక్షల విద్యార్థులు, 30లక్షల నిరుద్యోగులు హాజరుకావాలని టీపీసీసీ చీఫ్ విజ్ఞప్తి చేశారు. గతంలో రాహుల్‌గాంధీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించినట్లుగనే సరూర్ నగర్ సభలో యూత్ డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని రేవంత్‌రెడ్డి తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో ఉద్యమించి తెలంగాణను సాధించుకుంటే .. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలతో సరిపెడుతోందని మండిపడ్డారు రేవంత్‌రెడ్డి. తెలంగాణలో ఇంకా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాలు సంతలో సరుకుల మార్చేశారని రేవంత్ విరుచుకుపడ్డారు. ఇక ప్రియాంకా గాంధీ పాల్గొనే ‘విద్యార్థి, నిరుద్యోగ నిరసన సభ’కు భారీ జనసమీకరణపై ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా యూత్ కాంగ్రెస్‌లతో పాటు అనుబంధ సంఘాల ఛైర్మన్‌లతో థాక్రే, రేవంత్ సమావేశం నిర్వహించారు. అలాగే తెలంగాణలోని అన్ని వర్సిటీల నుంచి విద్యార్థులు, నిరుద్యోగులు సభకు హాజరయ్యేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.