Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలు2024 ఎన్నికల్లో జగనన్నసీఎం కావడం ఖాయం: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..!

2024 ఎన్నికల్లో జగనన్నసీఎం కావడం ఖాయం: చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..!

ప్రజా సంక్షేమం.. అభివృద్ధి.. హామీల అమలు, ప్రజాభిమానం, ఆదరణతోనే ఇది సాధ్యం..
నిజమైన ప్రజా సేవకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..
‘వై ఏపీ నీడ్స్ జగన్ ‘ కార్యక్రమంలో తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..

చంద్రగిరి:
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2024 ఏప్రిల్ నెలలో చేపట్టనున్న ప్రమాణస్వీకారం రోజున ప్రజలు పెద్ద ఎత్తున పండుగ జరుపుకోనున్నారని తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ సారథికి మళ్లీ పట్టం కట్టి సంక్షేమ ఫలాలు కొనసాగేలా ప్రజలు సంకల్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం చంద్రగిరి మండలంలో పిచ్చినాయుడు పల్లి, రాయలపురం, తొండవాడ, గంగుడుపల్లి, డోర్నకంబాల పంచాయతీలలో తుడా ఛైర్మెన్ పర్యటించారు. వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని జనసందోహం నడుమ వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మోహిత్ రెడ్డికి ఘనంగా స్వాగతం లభించింది. పంచాయతీలలో పార్టీ జెండా ఆవిష్కించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. జై జగన్ నినాదాలతో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి హోరెత్తించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు కేటాయించిన నిధుల జాబితా బోర్డ్ ను ఆవిష్కరించారు. తొండ వాడలో రూ.40 లక్షలతో నిర్మించిన సచివాలయం భవనాన్ని ,తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రారంభించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యా, వైద్యం కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. నేటి బాలలే రేపటి పౌరులుగా భావించి మెరుగైన విద్యను అందించేందుకు ఉపక్రమించారు. అందుకు నాడు – నేడు పథకం ద్వారా విద్యాలయాల ఆధునీకరణతో కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా మౌలిక వసతులు కల్పించారన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను విద్యార్థుల దరి చేరుస్తున్నారు. అలాగే అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా కానుక పేరుతో బడుగు బలహీన వర్గాలకు ఆపన్న హస్తం అందిస్తున్నారని తెలిపారు. గతంలో లేని విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకూ ఉచిత చికిత్స అందజేస్తున్నట్లు తెలిపారు. పల్లె పల్లెలో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు, అందుబాటులోకి 108 అంబులెన్స్ లు తీసుకొచ్చారని గుర్తు చేశారు. పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సీఎం వైయస్ జగనమోహన్ రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను అందించిన గొప్ప నాయకుడుగా.. రాబోయే ఎన్నికల్లో జగన్ అనే నిజాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎంతమంది కలిసివచ్చినా కూడా 2024 ఎన్నికల్లో ప్రజాభిమానం, ప్రజాదరణతో జగనన్న మళ్లీ సీఎం కావడం ఖాయం అని స్పష్టం చేశారు.చంద్రగిరి నియోజకవర్గంలో వ్యక్తిగతంగా ప్రజలకు సేవ చేస్తున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజమైన ప్రజా సేవకుడని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు సమర్థవంతంగా సేవ చేశారు అనుకుంటేనే ఆయన తనయుడిగా చంద్రగిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆశీర్వదించాలని తుడా ఛైర్మెన్ మోహిత్ రెడ్డి అభ్యర్థించారు. మీకు అందుబాటులో ఉంటూ.. నిరంతరం ప్రజలకు అందుబాటులోకి ఉంటూ సేవ చేస్తూ.. తండ్రికి తగ్గ తనయుడిగా మీ అందరి నుంచి ప్రశంసలు అందుకుంటానని తెలియజేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుండగా, 40 వేల మెజారిటీ ఇచ్చి అభిమానం చూపిన ప్రజల రుణం తీర్చుకోవాలని భావించారన్నారు. ప్రజలను కుటుంబ సభ్యులుగా భావించి పండుగల సమయంలో, విపత్కర సమయంలోనూ అండగా నిలిచిన పరిస్థితులను విశదీకరించారు. వరదలు, కరోనా సమయాలను గుర్తు చేసుకున్నారు. తన సొంత నిధులతో నిరంతరంగా పెళ్లి కానుకలు అందిస్తున్నారని తెలిపారు. నేడు ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవతో పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరగనంత అభివృద్ధి చంద్రగిరిలో జరిగిందని చెప్పేందుకు గర్వపడుతున్నానని వెల్లడించారు. మీ ఇంటి బిడ్డగా భావించి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధిలో ఆదర్శంగా చంద్రగిరి మండలంలో పంచాయతీలను తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాయలపురంలో రూ.7.94 కోట్లతో, పిచ్చినాయుడు పల్లిలో రూ.4.49 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.21.18 కోట్ల సంక్షేమ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఇందులో వైఎస్సార్ పెన్షన్ కానుక కింద అత్యధికంగా 400 మంది లబ్ధిదారులకు రూ.4.60 కోట్లు, 589 మందికి వైఎస్సార్ ఆసరా కింద రూ.3.14 కోట్లు, అమ్మ ఒడి పథకం కింద 295 మందికి రూ.1.28 కోట్లు అందించినట్లు వెల్లడించారు.
తొండవాడలో రూ.10.08 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టగా, రూ. 20.75 కోట్ల సంక్షేమ నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. పెన్షన్ కానుక కింద 445 మందికి రూ.4.97 కోట్లు అందిస్తున్నట్లు తెలిపారు.
గంగుడుపల్లి పంచాయతీలో రూ.4.60 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే రూ. 14.35 కోట్ల సంక్షేమ నిధులు ప్రజల ఖాతాల్లో జమ చేశామని తెలియజేశారు.
డోర్నకంబాల పంచాయతీలో రూ.4 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ మల్లం చంద్రమౌళి రెడ్డి, మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ కొటాల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ మస్తాన్, కుప్పిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగరాజు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article