తమిళనాట 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని హీరో విశాల్ ప్రకటించారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ ఎన్నికల్లో ఓ ఒక్కరితోనూ పొత్తు పెట్టకోనని, స్వతంత్రంగానే పోటీ చేస్తానని తెలిపారు. ముందు తానేంటో, తనకు ఎంత శక్తి ఉందో నెరవేర్చుకోవాల్సి ఉంటుందని, ఆ తర్వాత పొత్తులపై ఆలోచన చేస్తానని తెలిపారు. ఆ ఎన్నికల్లో తనతో పాటు మరికొందరు సినీ స్టార్స్ కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా, చెన్నై లయోలా కాలేజీలో తనతో పాటు చదువుకుని ఇపుడు సినీస్టార్స్‌గా ఉన్న వారు కూడా 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాగే, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని వంద శాతం పోలింగ్ జరిగేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో 70 నుంచి 80 శాతం మేరకు పోలింగ్ జరుగుతుందని, కానీ, చెన్నై వంటి నగరాల్లో ఇది 50శాతానికి మించడం లేదన్నారు. ఈ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చెన్నై కార్పొరేషన్ కమిషనర్‌తో పాటు ఎన్నిక సంఘం అధికారులు కృషి చేస్తున్నారని, వారి కృషికి తగిన గుర్తింపు ఇవ్వాలని హీరో విశాల్ తెలిపారు.