— నామినేషన్ కార్యక్రమానికి జనం భారీగా తరలి రావాలి
— అదే మన విజయానికి నాంది కావాలి
— నాయకులు సమన్వయంతో పనిచేయాలి
— నాయకులు గడపగడపకు వెళ్లి ప్రచారం చేయాలి
— మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి
గాజువాక: గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ ఈనెల 24వ తేదీన తన నామినేషన్ను దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి దిశా నిర్దేశం చేయడానికి నియోజకవర్గంలోని శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. 24వ తేదీ ఉదయం 9: 30 గంటలకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కొత్త గాజువాక సెంటర్ కు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. 68,69 వార్డులకు చెందిన కార్యకర్తలు, నాయకులు జింక్ గేటు వద్దకు రావాలని, పెద్దగంట్యాడ ప్రాంతానికి చెందినవారు బీసీ రోడ్ లోని మసీద్ వద్దకు రావాలని, అలాగే అగనంపూడి కూర్మన్నపాలెం వడ్లపూడి తదితర ప్రాంతాలకు చెందిన వారు కొత్త గాజువాక జంక్షన్ వద్ద సమావేశం కావాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి 12: 30గంటలకు నామినేషన్ దాఖలు చేస్తానని అమర్నాథ్ వివరించారు. గతంలో ఎన్నడు, ఎక్కడ జరగని విధంగా ఈ ర్యాలీ ఉండాలని ఈ ర్యాలీ తన విజయానికి తొలిమెట్టు కావాలని అమర్నాథ్ ఆకాంక్షించారు. నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేసి నియోజకవర్గంలోని ప్రజలకు ఒక పాజిటివ్ మెసేజ్ వెళ్లే విధంగా అందరూ కష్టపడాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. అంతర్గత విభేదాల వలన పార్టీ కార్యకర్తలను వదులుకోవద్దని, వైసీపీ గెలుపు చారిత్రక అవసరమని అమర్నాథ్ అన్నారు. ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే 30 ఏళ్ల పాటు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటారని ప్రతిపక్షాలు కనుమరుగవుతాయని అమర్నాథ్ చెప్పారు. రాష్ట్రంలో పార్టీతో పాటు తాను కూడా ఇక్కడ గెలిస్తే పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పారు.
ఇది ఇలా ఉండగా పార్టీలోని కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు నియోజకవర్గం లోని విస్తృత ప్రచారం చేస్తున్నారని దీనికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని అమర్నాథ్ చెప్పారు. అయితే పార్టీలోని కొంతమంది నాయకులలో సమన్వయ లోపంకనిపిస్తోందని, నాయకులు డోర్ టు డోర్ వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అమర్నాథ్ చెప్పారు. దానిని సరిచేసుకొని పార్టీ విజయానికి కృషి చేయాలని మంత్రి అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. తాను ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను చూస్తే మన విజయం ఖాయమని స్పష్టమవుతుందని అమర్నాథ్ తెలిపారు. మరో 20 రోజులు పాటు నాయకులు బాధ్యతగా కార్యకర్తలతో కలిసి పనిచేస్తే విజయం మన పార్టీని వరిస్తుందని చెప్పారు. పార్టీ కోసం తన విజయం కోసం కష్టపడి పనిచేసేవారిని గుర్తిస్తానని అమర్నాథ్ మరోసారి ప్రకటించారు. ఎన్నికల్లో ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు అన్న విషయం బూతు స్థాయిలో వచ్చే ఓట్ల సంఖ్యను బట్టి స్పష్టం అవుతుందని ఈ విషయాన్ని గుర్తించి పార్టీ నాయకులు పనిచేయాలని ఆయన కోరారు. ముఖ్యంగా వార్డు ఇన్చార్జిలు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నది వాస్తవమని ఇందులో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అవసరం లేదని అమర్నాథ్ అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదని జనం వేరే పార్టీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని ఆయన అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాల కన్నా తాను ఎక్కువ ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని, జగన్మోహన్ రెడ్డి పథకాలను చంద్రబాబు ఇవ్వడం దేనికి? మళ్లీ జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తే పథకాలు అన్ని సక్రమంగా వస్తాయని జనం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అమర్నాథ్ చెప్పారు.
ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగుతాయని పేదలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. నాయకులు సమన్వయ లోపం లేకుండా పార్టీ కోసం శ్రమించాలని ఆయన సూచించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి పథకాలు తీసుకుంటున్న వారంతా సైలెంట్ ఓటింగ్ కు సిద్ధంగా ఉన్నారని, మన పార్టీ గెలుపు దాదాపు ఖరారు అయిందని అమర్నాథ్ నామినేషన్ కార్యక్రమం తో పాటు ముఖ్యమంత్రి సభ తర్వాత అమర్నాథ్ కి మెజార్టీ ఎంత వస్తుంది అన్న అంశం పైన చర్చ జరుగుతుంది అని అన్నారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం డోర్ టు డోర్ వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి మాట్లాడుతూ, పార్టీ నాయకులు బూత్ స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారంతా వైసీపీకే ఓటు వేసే విధంగా ప్రచారం ప్రచారం చేయాలి తప్ప నాయకులు పార్టీ పెద్దలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. గ్రామాల్లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉరుకూటి అప్పారావు మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో మనం చేసిన అభివృద్ధి గత ప్రభుత్వాలు ఏమీ చేయలేదని, అందుకే ప్రజలను ఓట్లు అడిగే హక్కు మనకే ఉందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తేనే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు పల్లా చిన్న తల్లి, కార్పొరేటర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.