జమ్మూ కాశ్మీర్ మరో ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు కీలక విజయం లభించింది. ఈ ఎన్‌కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయినట్లు పోలీసులు వెల్లడించారు.కొద్ది రోజుల్లో ఉగ్రవాదులు భారీగా దాడులకు సిద్ధం అవుతున్నారనే నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. తాజాగా గురువారం ఉదయం బారాముల్లా జిల్లాలోని క్రీరి ప్రాంతంలో వనిగం గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ముందస్తు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు మట్టుపెట్టారు. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఒక ఎకె రైఫిల్ మరియు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు స్థానికులే అని.. నిషిద్ధ టెర్రర్ గ్రూప్ లష్కరే తోయిబాకు చెందిన వారిగా తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదులు షకీర్ మాజిద్ నాజర్, హనన్ అహ్మద్ సెహ్ గా గుర్తించారు. వీరిద్దరు 2023లో ఉగ్రవాదంలోకి చేరారని, తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు.అంతకుముందు రోజు బుధవారం కూడా కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద చొరబాటుకు యత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని బలగాలు మట్టుపెట్టాయి. 24 గంటల్లోనే రెండు ఎన్ కౌంటర్లలో నలుగుర ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొన్ని రోజుల్లో శ్రీనగర్ కేంద్రంగా జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ ను అస్థిర పరిచేందుకు ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరికలు నేపథ్యంలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. జమ్మూ-పఠాన్‌కోట్ జాతీయ రహదారి వెంబడి ఉన్న అన్ని ఆర్మీ పోస్టులను అప్రమత్తం చేశారు. జమ్మూ, సాంబా, కథువా కంటోన్మెంట్ ఏరియాల్లో అన్ని పాఠశాలను బుధవారం మూసేశారు. గత నెలలో పూంచ్ లో జరగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మరణించారు. దాడికి తెగబడిన టెర్రరిస్టులను గుర్తించేందుకు భారీగా సెర్చ్ ఆపరేషన్ జరిగింది. అయితే ఉగ్రవాదులు పట్టుబడలేదు.