- ఐదేళ్లలో 2 వేల నూతన వంగడాల ఆవిష్కరణ.
- కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రుల వెల్లడి.
- ఏలూరు ఎంపీ మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు బదులిచిన కేంద్ర మంత్రులు.
ఏలూరు
గత ఐదేళ్లలో 8,30,986 మంది ఏపీకి చెందిన రైతులకు శిక్షణ ఇచ్చామని, 2 వేల నూతన వంగడాలను ఆవిష్కరించామని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రులు భగీరత్ చౌదరి, రామ్ నాథ్ ఠాగూర్ ప్రకటించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో బుధవారం అడిగిన ప్రశ్నలకు మంత్రులు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
ఐదేళ్లలో దేశంలోని రైతులకు నైపుణ్యాలు మెరుగు పరచడానికి అమలు చేస్తున్న పథకాలు, రైతులు, ముఖ్యంగా మహిళలు, యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఎంత మొత్తం నిధులు ఖర్చు చేశారని పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి రామ్ నాథ్ ఠాగూర్ బదులిస్తూ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ కేంద్ర ప్రాయోజిత పథకాన్ని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని, అత్యాధునిక సాంకేతికత పట్ల అవగాహన కల్పించడానికి ఏపీలో మొత్తం 26 జిల్లాలతో సహా దేశంలోని 28 రాష్ట్రాలు, ఐదు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 739 జిల్లాల్లో అమలు చేస్తున్నట్లు తెలిపారు.
గత ఐదేళ్లలో ఆత్మ పథకం ద్వారా 5,74,817 మంది రైతులకు శిక్షణ నిమిత్తం రూ.41.61 కోట్లు ఖర్చు చేశామని, కిసాన్ వికాస్ కేంద్రాల ద్వారా 2,35,514 ముందు రైతులకు శిక్షణ ఇచ్చేందుకు రూ.701.82 కోట్లు ఖర్చు చేశామని, స్కిల్ ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ పథకం ద్వారా 2,317 మందికి, ఎస్ఎమ్ఏఎం పథకం ద్వారా 11,043 మంది, ఆర్కేవివై పథకం ద్వారా 165 మంది, స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ద్వారా 686 మంది, పిఎంకేవివై ద్వారా 4,517 మందికి, కృషి శక్తి పథకం ద్వారా 1927 మంది చొప్పున ఏపీలో మొత్తం 8,30,986 మంది రైతులు శిక్షణ పొందారని, ఎన్ఆర్ఎల్ఎం పథకం ద్వారా 97 డ్రోన్లు అందజేసినట్లు మంత్రి తెలిపారు.
భారత వ్యవసాయ పరిశోధన మండలి ( ఐ సి ఏ ఆర్ ) ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ఏడు రోజుల స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ అమలు చేస్తుందని, 2014-15లో “వ్యవసాయ యాంత్రీకరణపై ఉప మిషన్” పేరిట రూపొందించిన ప్రత్యేక పథకం ద్వారా దేశంలోని నాలుగు ఫార్మ్ మెషినరీ ట్రైనింగ్, టెస్టింగ్, ఇన్స్టిట్యూట్స్ నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తున్నాయని, వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన అమలు చేస్తున్నట్లు మంత్రి బదులిచ్చారు.
మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద ఉద్యాన విభాగం యొక్క సమగ్ర వృద్ధికి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సమగ్ర ప్రయోజిత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, జూలై 2015లో స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్‌ను ప్రారంభించిందని, దీని కింద ఆమోదించబడిన అర్హత ప్రకారం గ్రామీణ యువత మరియు రైతులకు కనీసం 200 గంటల వ్యవధి గల నైపుణ్య శిక్షణా కోర్సులను నిర్వహిస్తోందని, వ్యవసాయం, అనుబంధ రంగాలలో అగ్రికల్చర్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చేపట్టే కార్యక్రమాలను నుంచి ఉపసంహరించినట్లు మంత్రి తెలిపారు.
నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కింద వ్యవసాయం, అనుబంధ రంగాల కింద మహిళలు, యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తోందని, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద డ్రోన్ అప్లికేషన్‌లపై స్వయం సహాయక సంఘాల మహిళలకు, రైతులకు శిక్షణ ఇస్తున్నామని మంత్రి సమాధానం ఇచ్చారు.
ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే నూతన వంగడాల అభివృద్ధికి పరిశోధనలు చేస్తుంటే గత ఐదేళ్లలో ప్రధాన పంటలకు సంబంధించి ఎలాంటి వంగడాలు ఉత్పత్తి చేస్తారని, పరిశోధనల నిమిత్తం మొత్తం ఎన్ని నిధులు కేటాయించారని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి భగీరత్ చౌదరి బదులిచ్చారు.
గత ఐదు సంవత్సరాలలో ఇప్పటి వరకు 372147.4 క్వింటాళ్ల ఉత్పత్తి లక్ష్యంతో 2000 వంగడాలను 60 వ్యవసాయ క్షేత్రాల్లో 542891.9 క్వింటాళ్ల బ్రీడర్ సీడ్ ఉత్పత్తి చేశామని, రైతుల ప్రయోజనాల కోసం గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మొత్తం 2122.86 లక్షల క్వింటాళ్ల సర్టిఫైడ్ నాణ్యత కలిగిన విత్తనాలను పంపిణీ చేయగా, ఏపీలో గత ఐదేళ్లలో 786.6 క్వింటాళ్ల ఇండెంట్‌కు 1,930.4 క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి చేసినట్లు మంత్రి తెలిపారు.1840 వంగడాల్లో శీతోష్ణస్థితిని తట్టుకోగల 329 రకాలు కరువు, తేమ ఒత్తిడి, నీటి ఒత్తిడి సహనం, వరద నీటిలో మునిగిపోవడం, లవణీయత, క్షారత, సోడిక్, అధిక ఉష్ణోగ్రత సహనం, చలిని తట్టుకునేలా అభివృద్ధి చేశామని, 2019-20 నుండి 2023-24 వరకు బడ్జెట్ లో రూ. 3254.01 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.930.22 కోట్లు కేటాయించ్చినట్లు మంత్రి తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇన్‌స్టిట్యూట్‌లతో సహా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో జాతీయ వ్యవసాయ పరిశోధనా వ్యవస్థ నిరంతరం పరిశోధనలు చేస్తుందని, అధిక దిగుబడినిచ్చే, బయోటిక్, అబియోటిక్ మొత్తం 2000 రకాల వంగడాలను గత ఐదేళ్లలో విడుదల చేశామని వీటిలో 1840 వంగడాలు ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుంటాయని మంత్రి బదులిచ్చారు.
సీడ్ విలేజ్ కార్యక్రమం కింద తృణధాన్యాల పంపిణీకి 50 శాతం, వాతావరణ నిరోధక పంటల రకాలతో సహా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పచ్చి రొట్ట విత్తనాలు 60 శాతం రాయితీతో రైతులకు సరఫరా చేస్తున్నామని, 2011లో ప్రారంభించిన ‘నేషనల్ ఇన్నోవేషన్స్ ఇన్ క్లైమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్ ఫ్లాగ్‌షిప్ నెట్‌వర్క్ ప్రాజెక్ట్, వాతావరణాన్ని తట్టుకునే వంగడాల సాంకేతిక ఆవిష్కరణలపై కూడా దృష్టి పెడుతుందని, ఈ ప్రాజెక్ట్ కింద క్లైమేట్ రెసిలెంట్ విలేజ్ అభివృద్ధి చేయడంతో పాటు లొకేషన్ స్పెసిఫిక్ క్లైమేట్ రెసిలెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో 446 గ్రామాల్లో 2,13,421 క్షేత్రాల్లో 2,35,874 హెక్టార్ల విస్తీర్ణంలో నూతన వంగడాలు ఆవిష్కరిస్తున్నామని, నేషనల్ మిషన్ ఆన్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కింద అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.