Friday, January 10, 2025

Creating liberating content

రాజకీయాలుఏపీలో పొలిటికల్ పంచాంగం

ఏపీలో పొలిటికల్ పంచాంగం

కడప సిటీ :తెలుగు నూతన సంవత్సరాది వచ్చింది. శ్రీ క్రోధి నామసంవత్సరంలోకి ప్రవేశించింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని అందరూ భక్తి పూర్వకంగా సేవిస్తారు. ఇక, ఇతర రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే కొత్త సంవత్సర వేడుకకు(అందరూ ఇదే రోజును వేర్వేరు పేర్లతో నిర్వహించు కుంటారు) మన తెలుగు నాట చేసుకునే ఉగాదికి తేడా ఏంటంటే.. మన దగ్గర జాతకాలకు ప్రాధాన్యం ఉంది. దీనినే రాశి ఫలాలు అంటారు. వ్యక్తుల పరంగానే కాకుండా.. రాజకీయ పార్టీల పరంగా కూడా ఈ రాశి ఫలాలు చెబుతుండడం ఆనవాయితీగా వస్తోంది.వ్యక్తుల విషయాన్ని పక్కన పెడితే.. రాజకీయ పార్టీలు, నేతల పరంగా చూసుకుంటే.. ప్రస్తుత కీలకమైన ఎన్నికల సమయం కావడంతో పార్టీల నాయకులు ప్రత్యేకంగా ఈ రాశి ఫలాలు, జాతకాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇలానే.. ఏపీ అధికార పార్టీవైసీపీ, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన, బీజేపీలు తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని జాతకాలు చెప్పించుకున్నాయి. అయితే.. ఇక్కడ ఎవరి పంచాంగం వారిదే! ఎవరి రాశి ఫలాలు వారివే అన్నట్టుగా మారిపోవడం గమనార్హం.వైసీపీ విషయానికి వస్తే.. మరోసారి ముఖ్యమంత్రి కావడం..జగన్‌కు ఖాయమని పంచాంగ కర్తలు చెబుతు న్నారు. రాష్ట్రంలో మేలు చేస్తున్న నాయకుడు కాబట్టి.. ఆయనకే ప్రజలు పట్టం కట్టడం ఖాయమని అంటున్నారు. అంతేకాదు. ప్రస్తుతం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జాతకం కూడా మలుపు తిరుగుతోందని చెబుతున్నారు దీంతో ఆయనకు రాజ్యాధికారం మరొసారి దఖలు పడుతుందనేది వైసీపీ పంచాగకర్తలు చెబుతున్నారు.ఇక, టీడీపీ విషయానికి వస్తే.. ఇక్కడ పంచాగ కర్తలు కూడా.. సేమ్ టు సేమ్‌.. అలానే చెబుతున్నారు. ఇప్పుడు ప్రజలంతా చంద్రబాబు వైపు ఉన్నారని తెలిపారు. రాజ్యపూజ్యం చంద్రబాబుకు ఎక్కువగా ఉందని దీంతో ఆయన ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవడం ఖాయమనేది వారి వాదనగా ఉంది. అదేవిధంగా కూటమి పార్టీలతో కలిసి ముందుకు సాగుతున్నందున.. ఖచ్చితంగా చంద్రబాబు విజయం దక్కించుకుని భారీ సంఖ్యాబలంతో అధికారంలోకి వస్తారని చెబుతున్నారు.అదేవిధంగా జనసేన, బీజేపీల విషయంలోనూ పంచాంగ కర్తలు.. ఇదే విషయం వెల్లడిస్తున్నారు. ఇరు పార్టీల ప్రాధాన్యం రాష్ట్రంలో పెరుగుతుందని… ప్రజాదరణ ఉందని అంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో అద్భుత విజయాలు సొంతం చేసుకోవడం ఖాయమన్నది ఈ రెండు పార్టీలకు సంబంధించిన పంచాంగ కర్తలు చెబుతున్నారు. మొత్తంగా ఎలా చూసుకున్నా.. ఎవరి పంచాంగం వారిదే.. ఎవరి జాతకాలు వారివే. అయితే.. అసలు పంచాంగం.. అసలు జాతకాలు కావాలంటే.. నాయకులైనా.. ప్రజలైనా.. జూన్ 4వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article