చంద్రబాబుని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘‘చంద్రముఖిని నిద్రలేపితే మళ్లీ ఇంటింటికీ ‘లకలకా లకలకా’ అంటూ మీరు రక్తం తాగేందుకు వస్తుంది’’ అనే ఈ విషయాన్ని అందరూ గుర్తెరగాలని జగన్ అన్నారు. గతంలో జరిగిన విషయాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. చంద్రబాబుని ఓడించడానికి, పేదలను గెలిపించడానికి మరోసారి విలువలు, విశ్వసనీయతకు ఓటు వేయాలని జగన్ అభ్యర్థించారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, కురాన్ లాంటిదని వ్యాఖ్యానించారు.ఈ మేరకు పెదకూరపాడు నియోజకవర్గంలోని పెదకూరపాడు సెంటర్ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నంబూరి శంకర్రావుని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన అభ్యర్థించారు.అసెంబ్లీ ఎన్నికలు-2024 ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘జరగబోతోంది కురుక్షేత్ర యుద్ధం. ఈ ఎన్నికల్లో కేవలం ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకునేందుకు మాత్రమే ఓటు వేయడం లేదు. మీరు వేసే ఓటు ఇంటింటి భవిష్యత్‌ను, పథకాల కొనసాగింపును నిర్ణయించబోతోంది. ఈ ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేస్తే పథకాలన్ని కొనసాగింపు. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోవడమేనని ఆలోచించాలని ప్రతి ఒక్కర్నీ కోరుతున్నాను. చంద్రబాబు చరిత్ర చెబుతున్న సత్యం ఇదేనని గుర్తెరగాలని కోరుకుంటున్నాను. సాధ్యం కాని రీతిలో ఆయన ఇచ్చిన హామీల అర్థం ఇదేనని గుర్తించాలని అందరినీ కోరుతున్నాను’’ అని చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు.