మన ఆస్తి మనదని నిరూపించుకోవాలా?: పవన్ కల్యాణ్జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏలూరు జిల్లా కైకలూరులో వారాహి విజయభేరి సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, భూములు దోచేందుకు కొత్త చట్టం తెచ్చారని విమర్శించారు. అసెంబ్లీలో చర్చ జరపకుండానే చట్టం తెచ్చారని పవన్ ఆరోపించారు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు… జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని వ్యాఖ్యానించారు. మన ఆస్తి మనదని రుజువు చేసుకోవాలా? 90 రోజుల్లో రుజువు చేసుకోకపోతే ఆ భూమిని ఏం చేస్తారు? 100 గజాల భూమి ఉన్న వ్యక్తి కూడా తన భూమి కోసం హైకోర్టును ఆశ్రయించాలా? అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో మీడియాను అణచివేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మీడియాను నియంత్రించేందుకు జీవో నెం.1 తీసుకువచ్చారని వెల్లడించారు. వైసీపీ పాలనలో 112 మంది పాత్రికేయులపై దాడులు జరిగాయని, పాత్రికేయులపై 430 కేసులు నమోదు చేశారని పవన్ వివరించారు.
ఇక, స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు పైనా పవన్ ఈ సభలో స్పందించారు. జగన్ కుతంత్రాల వల్ల గాజు గ్లాసు గుర్తును ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇచ్చారని పేర్కొన్నారు. కుట్రలకు భయపడి వెనుకంజ వేయబోమని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ కు ఈ ఎన్నికలు ఎంతో కీలకమని, ప్రజలు ఆలోచించి ఓటుపై నిర్ణయం తీసుకోవాలని జనసేనాని పిలుపునిచ్చారు.