వైఎస్సార్ జిల్లా బద్వేల్ నోడల్ అధికారి ఫిర్యాదు
కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలపై వైఎస్సార్ జిల్లాలో పోలీస్ కేసు నమోదైంది. కోర్టు ఆదేశాలను అతిక్రమించారని ఫిర్యాదు అందడంతో షర్మిలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 2న బద్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో పాల్గొన్న షర్మిల.. తన ప్రసంగంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావిస్తూ పలు కామెంట్లు చేశారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్యను ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ నేత ఒకరు కడప కోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. దీనిని అడ్డుకునేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ఈ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని ఆదేశాలు జారీ చేసింది.అయితే, ఎన్నికల సమయంలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించ వద్దని, ఈ కేసుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు రాజకీయ నేతలను హెచ్చరించింది. బహిరంగ సభలో వైఎస్ వివేకా హత్య కేసును ప్రస్తావించడం ద్వారా షర్మిల కోర్టు ఆదేశాలను ధిక్కరించారని బద్వేల్ నోడల్ అధికారి, బద్వేల్ మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా షర్మిలపై ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.