Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంనా దేశ రాజకీయమా..నీకో దండం..🙏..!

నా దేశ రాజకీయమా..నీకో దండం..🙏..!

ధనమూలం ఇదం పాలిటిక్స్..

(ఇది రాజకీయ వ్యాసం
అని మాత్రం అనుకోకండి..
అందరూ చదవాల్సిన సత్యం..ఈ దేశంలో ఇప్పుడు నిత్యకృత్యం..!)

డబ్బులు అందలేదంటూ ప్రజాప్రతినిధుల ఇళ్ళు..
అభ్యర్థుల భవంతుల ముట్టడి..

ఈ ఎన్నికల్లో ఇది అత్యంత హేయమైన ఘటన..

స్టీల్ సిటీ..ఎంతో అభివృద్ధి చెందిన నాగరిక నగరం…అత్యధిక శాతం విద్యాధిక ఓటర్లు కొలువై ఉండే కార్పొరేట్ సిటీ..
వైజాగ్ తో పాటు ఇలాంటి సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొన్ని చోట్ల
ఈ ఎన్నికల వేళ చోటు చేసుకున్నాయి..

అంతేకాదు..పూర్వం ఒక అభ్యర్థి అనుచరులు ఓటర్లకు డబ్బులు పంచకుండా వేరే అభ్యర్థి అనుచరులు కాపు కాసే వారు..ఈ ఎన్నికల్లో అన్ని పార్టీల వారు యధేచ్చగా పంచారు గనక..ఒకటి రెండు చోట్ల మినహా మిగిలిన అన్ని చోట్ల పంపిణీ ఓపెన్ గానే జరిగింది..నీ తర్వాత నేను..
నా తరవాత నువ్వు అన్న చందాన ఓటరు జాబితాలు పట్టుకుని మరీ నగదు పంపిణీ చేశారు.ఒక ఇంట్లో అయిదు ఓట్లు ఉంటే
ఆ ఇంటికి పది పదిహేను వేల
రూపాయలపైనే కిట్టుబాటు అయింది.ఉన్నత వర్గాలు..
సంపన్నులు..లక్షల్లో ప్యాకేజీలు ఉన్న ఉద్యోగులు సైతం డబ్బులు అందుకున్న వారిలో ఉన్నారు.
నిఘా నేత్రం లొట్టబోయింది.!

అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారాలు..అక్కడ కూడా చివరి నిమిషం ప్రలోభాలు
విశృంఖలంగా జరిగాయి..
నో పోలీస్..
నో నిఘా..నో కంట్రోల్..!

దూర ప్రాంతాలలో ఉంటున్న వారికి ప్రయాణ ఖర్చులు ఇచ్చి మరీ రప్పించిన దృష్టాంతాలూ లేకపోలేదు.
ఓటు వేయడానికి ఇతర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు తరలి వచ్చిన ప్రజల స్ఫూర్తిని కించపరచడం లేదు గాని ఈసారి ప్రయాణీకుల రద్దీ పెరిగిపోవడానికి అది కూడా ఒక కారణమే!

చివరకు తేలే ఫలితం ఎలా ఉండబోతుందనే విషయాన్ని పక్కనబెడితే
అసలు ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి.ఇదంతా రాజకీయ నాయకుల వల్లనే అన్నది నిస్సందేహం..!

ఈ వ్యాసంలో ఇతర విషయాల గురించి రాసే ముందు రాజకీయాలకు..
డబ్బుకు ఉన్న లింకు గురించి మాట్లాడుకుందాం.పూర్వం..రాజకీయం అంటే ప్రజాసేవ..పోనీ రాజకీయమంటే రాజకీయమే..పదవికి డబ్బుకి పెద్దగా లింకు ఉండేది కాదు.ఒకవేళ డబ్బున్న వాళ్ళు..
భూస్వాములు..
పెత్తందార్లు..రాజకీయాల్లోకి వచ్చినా వాళ్ళు అప్పటికే స్థితిమంతుల కింద లెక్క.
కొందరైతే ఎకరాలు అమ్ముకుని రాజకీయాల్లో కొనసాగిన ఉదంతాలు కూడా మనకు తెలుసు కేవలం ధనార్జన కోసమే రాజకీయాల్లోకి రావడం
గత మూడు నాలుగు దశాబ్దాల నుంచి మొదలై ఇప్పుడు రాజకీయం పూర్తిగా
ఒక వ్యాపారంగా మారిపోయింది..డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావడం పరిపాటైపోయింది..దాంతో పాటు అప్పటికే సంపాదించిన ఆస్తులు కాపాడుకోడానికి..వీలైతే పెంచుకోడానికి రాజకీయం ఒక వేదికగా మారిపోయింది.

ఇదే..ఇదే..ఎన్నికల్లో ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడానికి కారణం అయింది.దీని వల్ల సంపద ఉన్నవాడు..కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాడు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి.
గతంలో రాజకీయ నాయకులు..
ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేసింది తక్కువ..అసలు లేనట్టే..అయితే భూస్వాములు..లేదంటే పారిశ్రామికవేత్తలు..రాజకీయాల్లోకి వచ్చేవారు.
ఇప్పుడు వడ్డీ వ్యాపారులు..చిట్స్ నడిపే వాళ్ళు..రియల్ ఎస్టేట్ వ్యాపారులు..బిల్డర్లు..
వీళ్లంతా ప్రజాప్రతినిధులే.
రాజకీయాల్లోకి వచ్చాక
సారా వ్యాపారాలు..
కాంట్రాక్టులు..ఇతరత్రా ఏవి అవకాశం ఉంటే అవి చేజిక్కిచుకోవడం..సంపద పెంచుకోవడం..
అలా కూడబెట్టిన డబ్బు ఖర్చు చేసి మళ్లీ పదవులకు ఎగబడడం..ఇదీ వరస..!

మీకు తెలిసిన పరిసరాలను ఒకసారి పరికించండి..
గతంలో మీరు చూసిన నాయకుల స్థితిగతులను ఒకసారి గుర్తు చేసుకోండి.
ఒకనాడు రాజకీయ నాయకుడు..సర్పంచ్..
ఎమ్మెల్యే..ఎంపి..చివరకు ముఖ్యమంత్రి అయినా గాని
పంచె..లాల్చీ..కండువా..
కిర్రు చెప్పులు.. నడక..సైకిల్..కొంచెం సోగ్గాడైతే బుల్లెట్.. అంతే.. దూరప్రయాణానికి బస్సు..రైలు.
మామూలు ఇల్లు..ఒక మోస్తరు ధనవంతుడైతే డాబా..మండువాలోగిలి..
కట్ చేస్తే..కాలం గిర్రున తిరిగి.. వర్తమానంలోకి వస్తే..
చోటా నాయకుడు సైతం..
ఖరీదైన తెల్లబట్టలు..చుట్టూ భజన బృందం..మినిమం సుమో..స్కార్పియో..
స్కోడా..ఆడీ..ఫార్త్యూనర్..
ఏసి రైలు..అది కూడా చీపు అనుకుంటూ విమానం..
చేతిలో 555 సిగరెట్టు ప్యాకెట్టు..ఖరీదైన ఫోను..
రాజభవనాన్ని తలపించే ఇల్లు..ముందు నాలుగు కార్లు..స్విమ్మింగ్ పూలు..
ఇంటర్ కమ్ము ఫోను..అతడిని కలవాలంటే పెద్ద ఫిట్టింగు..
అల వైకుంఠపురం సెట్టింగు..
ఇదీ వాలకం..!

రాజకీయమంటే వ్యాపారం..
దౌర్జన్యం..దుర్మార్గం..
వారసత్వం..కుట్ర..కుతంత్రం..ఫ్యాక్షనిజం..ఫాసిజం..
హత్యలు..
చివరకు మతకలహాలు..
ఇన్నీ ఉంటేనే పరిపూర్ణ రాజకీయం..
ఇదీ ఆధునిక..ఆ..ధనిక రాజకీయ భారతం..!

అందుకే..అందుకే..
రాజకీయం కలుషితం అయిపోయింది..
ప్రజాస్వామ్యం మలినపడిపోయింది.
ప్రజలు సైతం నిజాయితీని కోల్పోతున్నారు..
(కొందరు మినహాయింపు..)
ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోతున్నాయి..
దివాళా తీస్తున్నాయి.
లక్షలు..కోట్లు ఖర్చు పెట్టి
గెలవడం..ఆ డబ్బు రికవరీ చేసుకోవడమే గాక మళ్ళీ ఎన్నికల కోసం మరింత
కూడబెట్టడం..ఇదేగా.. ఇంతేగా..వీటన్నిటికి తోడు
హత్యలు.. ఫ్యాక్షనిజాలు..
కక్షలు..కార్పణ్యాలు..
దోపిడీలు..దురాక్రమణలు..
స్కాములు..స్కీములు..
అంతా దుర్గంధం..
రొచ్చు కంపు..!

ఎన్నికలు..
ప్రజాస్వామ్య క్రతువు..
ప్రపంచం నివ్వెరపోయేలా
అద్భుతంగా జరిగిన యజ్ఞం..
కోట్లు ఖర్చు..లక్షలాది మంది భాగస్వామ్యం..
కోట్లాది ఓటర్లు..

ఇన్నీ చేసి..ఇంతా సాధించి..
ధూమ్ ధామ్ అనుకుంటూ..
కత్తి పోయి కర్ర వచ్చే
ఢాం..ఢాం..ఢాం..
అందుకే..

పెనం మీంచి పొయ్యిలో
పడ్డానికే..

అవే పద్ధతులు..
అవే దుర్మార్గాలు..
అవే దోపిడీలు..
నేతలు..అధినేతల పేర్లు మారతాయి.. అంతే..
కాదంటే కాస్త హెచ్చుతగ్గులు..
అందరిదీ ఒకటే తెగులు..!

ప్రజాస్వామ్యమా ఉన్నావా..
ఉంటే ఇలాగే వర్ధిల్లుతావా..

అవినీతి..అక్రమాలు
దినదిన ప్రవర్థమానం..
ప్రజలకేమో దినదినగండం..
దేశం అగ్నిగుండం..!

ప్రజాస్వామ్యానికి..
రాజ్యాంగానికి..
మహా నేతలకు..
క్షమాపణలతో..

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్..9948546286

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article