ఈ ఐపీఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ కథ ముగిసింది. గురువారం సన్‌రైజర్స్‌తో జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. జీటీ అంతకుముందు మ్యాచ్ కూడా ఇలాగే వర్షార్పణం అయింది. దీంతో ఈ సీజన్లో కేవలం 12 మ్యాచులే ఆడింది. ఐదు విజయాలు సాధించింది. వర్షం కారణంగా రద్దైన రెండు మ్యాచుల్లో చెరో పాయింట్‌తో కలిపి టైటాన్స్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. దీంతో ప్లేఆఫ్స్‌కు వెళ్లే అవకాశం లేదు. చివరి మ్యాచులోనైనా విజయంతో సీజన్‌ను ముగించాలనుకున్న గుజరాత్ ఆశలకు వరుణుడి వల్ల గండిపడింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తమకు మద్దతు ఇచ్చిన అభిమానులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఓ నోట్ రాశారు. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. “మేము ఆశించిన విధంగా ఈసారి టోర్నీని ముగించలేకపోయాం. కానీ ఈ సీజన్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోవడం జరిగింది. అలాగే కొన్ని గొప్ప జ్ఞాపకాలతో నిండిన సీజన్ ఇది. నేను మూడు సంవత్సరాలుగా ఈ అందమైన కుటుంబంలో భాగమయ్యాను. ఇది నేను ఎప్పటికీ మరచిపోలేని ప్రయాణం. కష్ట సమయాల్లో మమ్మల్ని ఆదరించి, ప్రేమను చూపిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ సారధి గిల్ తన నోట్లో రాసుకొచ్చాడు. ఇప్పుడీ పోస్ట్‌ను జీటీ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.