చంద్రగిరి:తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన మండపంలో శుక్రవారం శ్రీపద్మావతి పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. మే 19వ తేదీ వరకు ఈ ఉత్సవాలు
జరుగనున్నాయి. మొదటిరోజు వైశిష్ట్యం :
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటిరోజు అంటే వైశాఖశుద్ధ నవమిరోజైన శుక్రవారంనాడు శ్రీమలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయనాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి సాయంత్రం 5.30 గంటలకు వేంచేపు చేశారు.శోభాయమానంగా తీర్చిదిద్దినపెండ్లిమండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, పూలదండలు మార్చుకోవటం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తరువాత శ్రీస్వామివారికి కొలువు (ఆస్థానం) జరిగింది.
ఈ క్రతువుల అనంతరం చతుర్వేద పారాయణం, మలహారి, దేశిక, సౌరాష్ట్ర, వారహి, కాదన కుతూహల, నీలంబారి రాగాలు, వివిధ తాళాల వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.
పిదప ఆర్జిత భక్తులకు వస్త్ర బహుమానం, ప్రసాద వితరణ జరిగింది. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సహితుడైన స్వామి బంగారుతిరుచ్చిపై అశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో తొలిరోజు వివాహ వేడుక ఘనంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ ఏ వి ధర్మా రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, స్వేత సంచాలకులు సుబ్రహ్మణ్యం రెడ్డి , డిప్యూటీ ఈఓ గుణ భూషణ రెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
పౌరాణిక ప్రాశస్త్యం :
పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖశుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమినాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడురోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.