టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 17వ సీజన్ లో అదిరిపోయే ఆట తీరుతో ప్లేఆఫ్స్ చేరిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు టోర్నీలో తన చివరి లీగ్ మ్యాచ్ ను నేడు పంజాబ్ కింగ్స్ తో ఆడుతోంది. ఐపీఎల్ లో ఇవాళ డబుల్ హెడర్ (రెండు మ్యాచ్ లు) జరగనుండగా… తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. టాస్ గెలిచిన పంజాబ్ తాత్కాలిక సారథి జితేశ్ శర్మ ఏమీ ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఎస్ఆర్ హెచ్ జట్టుకు మొదట బ్యాటింగ్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి అతడి నిర్ణయం ఎలాంటి ఆశ్చర్యం కలిగించలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.కాగా, ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో రాహుల్ త్రిపాఠీకి తుదిజట్టులో స్థానం కల్పించారు. అటు, పంజాబ్ టీమ్ లో కెప్టెన్ శామ్ కరన్ సహా చాలామంది విదేశీ ఆటగాళ్లు టీ20 వరల్డ్ కప్ కోసం తమ జాతీయ జట్లలో చేరేందుకు వెళ్లిపోయారు. దాంతో నేడు సన్ రైజర్స్ తో మ్యాచ్ కోసం పంజాబ్ జట్టులో రిలీ రూసో రూపంలో ఒక్క విదేశీ ఆటగాడు మాత్రమే ఆడుతున్నాడు.