- అమ్మవారికి పసుపు కుంకుమతో సారె తెచ్చిన కుటుంబీకులు
తిరుపతి
తిరుపతిలో వెలసిన శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తుడా ఛైర్మన్, చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు కుటుంబ సమేతంగా సోమవారం సాయంత్రం అమ్మవారికి సారె సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరి తరపున తుమ్మలగుంట శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమలతో సారె తీసుకురావడంతో ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. గంగమ్మ ఆలయం వద్ద టీటీడీ ఛైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. గంగమ్మ దర్శనం తరువాత ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అత్యంత పవిత్రమైన గంగమ్మ జాతర మహోత్సవంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి అమ్మవారికి సారె సమర్పించే సంప్రదాయాన్ని తీసుకు రావడం అభినందనీయం అన్నారు. చంద్రగిరి నియోజక వర్గం నుంచి అమ్మవారి జాతరలో భాగస్వామ్యం వహించడం, అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయానికి ఉన్న శతాబ్ధాల చరిత్ర, ప్రాశస్థ్యం వెలికితీసి, గంగమ్మ ఆలయాన్ని రాష్ట్రంలో ఒక ప్రముఖ దేవాలయంగా తీర్చిదిద్దడానికి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన కృషి తిరుపతి ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. ఆలయ పునర్నిర్మాణం నుంచి జాతర నిర్వహణ వరకు ఆయన పడ్డ కష్టం వెలకట్టలేనిదన్నారు. ఇంత కాలం పరిమిత ప్రాంతంలో జరిగే గంగమ్మ జాతర వేడుక, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించిందన్నారు. అనంతరం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గం తరఫున గంగమ్మ తల్లికి పట్టు వస్త్రాలు సమర్పించడం, అమ్మవారి దర్శించు కోవడం సంతోషంగా వుందన్నారు. తిరుపతి గంగమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై వుండాలని, ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవనం సాగించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చెవిరెడ్డి కుటుంబంతో పాటు తుమ్మలగుంట గ్రామస్తులు, అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.