ఉప్పు వల్ల శరీరంలో వాటర్ రిటైన్ అయ్యి బరువు పెరిగిపోతారని, రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బీపీ పెరిగిపోతుందని, ఫలితంగా గుండె బలహీనపడి గుండె సమస్యలు వస్తాయని ఇలా రకరకాల వాదనలు చలామణిలో ఉన్నాయి. ఉప్పు తక్కువగా ఉండే పదార్థాలే ఆరోగ్యకరమైనవని కూడా ప్రాచూర్యంలో ఉంది. మరి నిజంగానే ఉప్పు పూర్తిగా తగ్గించడం ఆరోగ్యానికి మంచిదేనా? కొంత మంది నిపుణులు అసలు కాదని అంటున్నారు. సోడియం రిటెన్షన్ ఎంత ప్రమాదకరమో సోడియం తగ్గిపోవడం అంతకు మించి ప్రమాదకరం కావచ్చట. కొద్ది మొత్తంలో సోడియం స్థాయిలు తగ్గినా అది ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుందని అధ్యయన వివరాలు చెబుతున్నాయట.మన శరీరానికి అవసరమైన పోషకాల్లో సోడియం కూడా ఒకటి. ఇది ఉప్పు ద్వారా శరీరానికి అందుతుంది. అయితే సోడియం మోతాదుకు మించి తీసుకున్నపుడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం, బీపీ, గుండె సమస్యలు, ఊబకాయం వంటి రకరకాల అనారోగ్యాలకు కారణం అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఉఫ్పును మోతాదు కంటే తగ్గించి తీసుకోవడం, లేదా పూర్తిగా మానెయ్యడం చేస్తున్నారు. ఇలా చేస్తే దుష్ప్రభావాలు ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉఫ్పు బాగా తగ్గించి తీసుకుంటే సింపాథటిక్ నాడీ వ్యవస్థ చురుకుగా ఉండడం వల్ల నిద్ర సమస్యలు వస్తాయి. లో సోడియం సాల్ట్ వాడేవారిలో శరీరంలో సోడియం క్షీణించడాన్ని గమనించారు. అందువల్ల శరీరం మీద సోడియం క్షీణత వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది స్లీప్ ప్యాటర్న్ మీద నేరుగా ప్రభావం చూపుతుందని చాలా అధ్యయనాలు తేల్చి చెప్పాయి.ఉఫ్పు తగ్గించి తీసుకోవడం వల్ల సోడియం తగ్గిపోయి నిద్ర ప్యాటర్న్ చెడిపోతుందని జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినాలజి అండ్ మెటబాలిజమ్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం వివరిస్తోంది. ఈ అధ్యయనం కోసం మధ్య వయస్కులను ఎంచుకున్నారు. సోడియం తగ్గినపుడు రాత్రి నిద్ర నాణ్యత తగ్గి పోవడాన్ని స్పష్టంగా గమనించారు. చాలినంత నిద్ర లేకపోవడం వల్ల పనినాణ్యత తగ్గడం నుంచి రకరకాల సమస్యలు వేధిస్తాయి. దీర్ఘకాలం పాటు నిద్ర లేమి వేధిస్తే మెదడు పనితీరు మందగిస్తుంది. క్రమంగా డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు కూడా రావచ్చు. మతిమరుపు వేధించవచ్చు. కనుక నిద్ర చాలినంత ఉండాలంటే శరీరంలో సోడియం మోతాదులు సరిగ్గా ఉండాలి.ఉప్పు తగ్గించి తీసుకున్నపుడు సోడియం తగ్గడం మాత్రమే కాదు కాల్షియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా తగినంత లభించవు. అందువల్ల ఎముకల ఆరోగ్యం మీద కూడా దుష్ప్రభావాలు ఏర్పడుతాయి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఎంత ప్రమాదకరమో, బాగా తగ్గించెయ్యడం లేదా మానెయ్యడం కూడా అంతే అనారోగ్యకరం.