🦎🪳🐒🐛🦆🐥🐝
నేడు జీవ వైవిధ్య దినం
🦜🦜🦜🦜🦜🦜🦜
పులిని చూస్తే పులి
ఎన్నడు బెదరదు..
మేక వస్తే మేక
ఎన్నడు బెదరదూ..
మాయారోగమదేమొ గాని
మనిషి మనిషికి కుదరదూ..
కవి ఇలా రాసాడేమో గాని
మనిషికి దేనితోనూ నప్పదు..!
ప్రళయమైనా..విలయమైనా
అది మనిషి పుణ్యమే..
అర్థమే లేని
తన స్వార్థమే
ఈ అనర్థం..!!
మంచిని మరచి వంచన నేర్చి
నరుడే ఈనాడు వానరుడైనాడు….
కోటానుకోట్ల జీవరాశులు..
మనిషి ఉపిరి పోసుకోక మునుపే పుట్టినవి..
అవన్నీ ఇప్పుడెక్కడ…
ప్రకృతిపై ఆధారపడి
జీవించే మనిషి
తన అవసరాల కోసం
ఆ ప్రకృతినే మింగేస్తూ…
జగతినే విగతం చేస్తూ
అంతా తన స్వగతమై..
ప్రమాదానికి తానే స్వాగతమై
ఒకనాటికి తానూ గతమై..!
పచ్చని పొలాలు..
వాటిపై ఎగిరే పిచ్చుకలు..
ఆ పక్కనే నిండా నీటితో
నేల బావులు..
పక్షుల కిలకిలారావాలు..
మేత కోసం జట్టుగా
కదలివెళ్లే మూగజీవాలు..
అందమైన కాన్వాసుపై
దేవుడు మనోహరంగా
గీసిన బొమ్మ..
మనిషే ముష్కరుడై
చెరిపేసిన చిత్రం..
చిరిగిపోయిన రక్షణ ఛత్రం!
అడుగడుగునా భయపెట్టే
కాలుష్య భూతం…
ప్రకృతి అందంగా పేనిన
మేఘాల వరసను కమ్మేస్తూ
ఇతర జీవరాశులను కుమ్మేస్తూ..!
నీ కోసం నువ్వే చేస్తున్న
ప్రతి పని..
నీ సౌకర్యం కోసం
ప్రకృతి కైంకర్యం..!
నీ వసతి…
నీ వ్యవసాయం..
నీ పరిశ్రమ..
నీ రోడ్డు…
నీ విమానం..
రైలు..కారు..బస్సు…
కాలుష్యం బుస..
పేలిపోయే బుడగ..
ప్రమాదపు పడగ..!
తప్పులు చేస్తూ పోవడమే
నీ వేదాంతమైతే…
ఓ మనిషీ..ఒకనాటికి
అదే నీ అంతమై..!
జాగ్రత్త..
ఆరంభమైంది అంతం..
వదలకపోతే నీ పంతం..
ఇదే నీ వరసైతే
ఇక నీ బ్రతుకు
మరింత కురసై..
అంతా నేనే అనుకుంటున్న
నువ్వే ఒకనాటికి
ప్రకృతికి వికృతమై..
ఇదంతా
నీ స్వయంకృతమై..
✍️✍️✍️✍️✍️✍️✍️
(సురేష్..9948546286)