ఐపీఎల్ చరిత్రలోనే తొలి బ్యాటర్‌గా నిలిచే ఛాన్స్!
ఈసారి ఐపీఎల్ సీజన్‌ను పేలవంగా ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని ఏకంగా ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. ఫస్టాప్‌లో వరుస ఓటములతో డీలాపడ్డ ఆ జట్టు.. సెకండాప్‌లో అనూహ్యంగా పుంజుకుంది. వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) తో ఆర్‌సీబీ తలపడనుంది. ఇందులో గెలిస్తే క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్‌తో ఆడనుంది. విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ బెంగళూరు జట్టును ఈ స్థాయికి చేర్చిందనడంలో సందేహం లేదు. ఈసారి కింగ్ కోహ్లీ భీకరమైన ఫామ్‌తో ప్రత్యర్థులను వణికిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచులు ఆడిన విరాట్ 708 పరుగులు చేశాడు. ఆరెంజ్ క్యాప్‌తో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇక రన్ మెషీన్ 150కి పైగా స్ట్రైక్‌రేటుతో చేసిన 708 రన్స్‌లో 5 అర్ధ శతకాలు, ఒక శతకం కూడా ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే విరాట్ ఆర్‌సీబీ బ్యాటింగ్ విభాగానికి వెన్నెముక లాంటోడని అర్థమవుతోంది. ప్రతి మ్యాచులో అతని నిలకడైన బ్యాటింగ్ ఆ జట్టుకు బాగా కలిసొస్తుంది.ఇక ఈసారి దూకుడుగా ఆడుతున్న కోహ్లీని ఓ అరుదైన ఘనత ఊరిస్తోంది. తన రికార్డును తానే బ్రేక్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఐపీఎల్‌లో ఓ సీజన్‌లో అత్యధిక పరుగులు బాదిన ప్లేయర్ గా విరాట్ కొనసాగుతున్నాడు. 2016లో అతడు అత్యధికంగా 973 రన్స్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో సింగిల్ సీజన్‌లో ఓ బ్యాటర్ బాదిన అత్యధిక పరుగులివే.ప్రస్తుత 17వ సీజన్‌లో కోహ్లీ ఇప్పటివరకు 708 పరుగులు చేశాడు. తన సొంత రికార్డ్ బ్రేక్ చేయాలంటే మరో 266 పరుగులు చేయాల్సి ఉంది. మరి చూడాలి రన్ మెషీన్ తన సొంత రికార్డును బ్రేక్ చేస్తాడా? లేదా? మరోవైపు ఐపీఎల్‌లో 8 వేల పరుగులు పూర్తి చేయడానికి అతనికి ఇంకా 29 రన్స్ అవసరం. బుధవారం ఆర్ఆర్‌తో జరిగే ఎలిమినేటర్ మ్యాచులోనే కోహ్లీ ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది.ఇదిలాఉంటే.. విరాట్ కోహ్లీపై ఆర్‌సీబీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ స్టార్ బ్యాటర్ చెలరేగితే ప్లేఆఫ్స్‌లో మంచి స్కోరు లభిస్తుందని ఆ జట్టు భావిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్‌తో ప్లేఆఫ్స్‌ను ఆరంభించనున్నారు. ప్రస్తుత సీజన్‌లో కోహ్లీ చేసిన ఏకైక శతకం కూడా ఆర్ఆర్‌పైనే కావడం గమనార్హం. ఇంకొక విషయమేంటంటే వరుస మ్యాచులు గెలిచి ప్లేఆఫ్స్‌లోకి వచ్చిన బెంగళూరు ఒకవైపు, నాలుగు పరాజయాలతో ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టిన రాజస్థాన్ మరోవైపు తలపడనున్నాయి. ఈ మ్యాచులో ఆర్‌సీబీ విజయం సాధించాలంటే కోహ్లీ ఫామ్ చాలా కీలకం. అన్ని విభాగాల్లో రాణించి ఎలిమినేటర్ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫయర్-2లోకి అడుగుపెడుతుంది. క్వాలిఫయర్-1లో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తో క్వాలిఫయర్-2లో తలపడుతుంది. ఒకవేళ ఈ మ్యాచులో గెలిస్తే.. ఇప్పటికే ఫైనల్ చేరిన కేకేఆర్‌తో తలపడే అవకాశం ఉంటుంది. కాగా, బెంగళూరు ఫ్రాంచైజీ ఇప్పటివరకూ ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవని విషయం తెలిసిందే.