ఏపీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంని పగలగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్టారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి సమీపంలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశించడంతో తెలంగాణ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఏపీ పోలీసులు ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్‌హౌస్‌లో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే.. మాచర్లలో ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లిని ఏ1గా చేర్చినట్లు ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. మొత్తం 10 సెక్షన్ల కింద మెమో ఫైల్ చేశామన్నారు. ఐపీసీ, ఆర్‌పీ, పీడీపీపీ చట్టాల పరిధిలోని 10 సెక్షన్లతో ఆయనపై కేసులు నమోదు చేశామన్నారు. ఐపీసీ కింద 143, 147, 448, 427, 353, 452, 120బీ సెక్షన్లు, పీడీపీపీ కింద మరో కేసు, ఆర్‌పీ చట్టం కింద 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఏడేళ్ల వరకు శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. ఇక ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనను ఈసీ సిగ్గుమాలిన చర్యగా పేర్కొందని, ఇలాంటి ఘటనలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సీఈఓ చెప్పారు.