మైనారిటీల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది
సమస్యల పరిష్కారానికి మైనారిటీల ముంగిటకే కమిషన్ రాక
మైనారిటీల నుండి 48 వినతుల స్వీకరణ
రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ డా.ఇక్బాల్ అహ్మద్ ఖాన్ వెల్లడి
విశాఖపట్నం, నవంబర్ 16 : రాష్ట్రంలోని మైనారిటీ లకు పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందించడమే కాకుండా, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ డా. ఇక్బాల్ అహ్మద్ ఖాన్ తెలిపారు. మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు.
ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మైనారిటీలైన ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీల సమస్యల వినతుల స్వీకరణ కార్యక్రమం రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది.
ఈ సందర్బంగా ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్ది మైనారిటీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. గతేడాది మే నెల 9న కమిషన్ చైర్మన్ గా పదవీ బాధ్యతలను స్వీకరించడం జరిగిందన్నారు. నాటి నుండి మైనారిటీల సమస్యలపై వినతులను స్వీకరించి,వాటిని ప్రభుత్వానికి నివేదించడమే కాకుండా, సంబంధిత శాఖాధికారుల ద్వారా పరిష్కారం చేస్తున్నట్లు భరోసా ఇచ్చారు. ఈ కమిషన్ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్నందున అంత దూరం రాలేని పేద ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పారసీల సమస్యల పరిష్కార దిశగా కమిషన్ మీ ముంగిటకు వస్తుందన్నారు. అందులో భాగంగానే గతంలో కర్నూలు,ఇవుడు విశాఖపట్నంకు కమిషన్ హాజరైనట్లు గుర్తుచేశారు. మైనారిటీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, కావున మైనారిటీలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా, వాటిని లిఖిత పూర్వకంగా కమీషన్ దృష్టికి తీసుకురావాలని చైర్మన్ పిలుపునిచ్చారు. సమస్యలను సంబంధిత శాఖాధికారుల ద్వారా అర్జీదారునికి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర నుండి వచ్చిన మైనారిటీల నుండి 48 సమస్యలను, ఫిర్యాదులను కమీషన్ స్వీకరించింది. వాటిని సంబంధిత అధికారులకు పంపి, వారి నుండి నివేదికలు తెప్పించుకొని న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని చైర్మన్ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం మైనారిటీల శ్రేయస్సు కోసం ఎంతగానో కృషి చేస్తుందని, వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలులో ఉన్నాయని అన్నారు. వాటి పట్ల మైనారిటీలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించి, వారికి పథకాలు లబ్ధి చేకూరే విధంగా ప్రయత్నం చేయాలని ఛైర్మన్ అధికారులను కోరారు.
మైనారిటీ కమిషన్ మెంబర్ సయ్యద్ హిదయతుల్లా మాట్లాడుతూ తొలిసారిగా కమిషన్ కర్నూలు జిల్లాలో పర్యటించిందని, రెండవ కార్యక్రమంగా విశాఖపట్నంలో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు , పారసీలు మొదలగు మతాల వారి సమస్యల పరిష్కారం కొరకు మైనారిటీ కమిషన్ పనిచేస్తుందని తెలిపారు. మైనారిటీల సమస్యలు మరియు సంబంధిత సంస్థల సమస్యలు తీర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్న సంగతిని ఆయన గుర్తుచేశారు. క్షేత్రస్థాయిలోని మైనారిటీల సమస్యలు విని పరిష్కరించాలన్న ఉద్దేశంతో కమిషన్ మీ ముంగిటకు రావడం జరిగిందన్నారు. ఈ అవకాశాన్ని మైనారిటీలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చైర్మన్ తన బాధ్యతలను స్వీకరించిన నాటి నుండి ఇప్పటివరకు 67 సమస్యలకు కమిషన్ శాశ్వత పరిష్కారం చూపడం జరిగిందని, ఇది ఎంతో శుభదాయకమన్నారు.
మైనారిటీ కమిషన్ మెంబర్ షేక్ సైఫుల్లా మాట్లాడుతూ మైనారిటీల సమస్యలు తెలుసుకొని, పరిష్కరించేందుకు విశాఖకు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. మైనారిటీ లకు చెందిన అన్ని సమస్య లతో పాటు భూ తగాదాలు, ఆక్రమణలు, ధ్రువీకరణ పత్రాల జారీలో సమస్యలు వంటి వాటిపై కమిషన్ చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిణి ఎస్.జ్యోతి మాధవి మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మైనారిటీ లకు చెందిన సమస్యలను, ఫిర్యాదులను కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లవచ్చని, లేదా తమ కార్యాలయంలో అందజేస్తే వాటిని కమిషన్ కు పంపుతామని ఆమె వివరించారు.
మైనారిటీ కమిషన్ స్వీకరించిన కొన్ని వినతులు….
విశాఖపట్నం దసపల్లా హిల్స్ నుండి సతీందర్ సింగ్ సేతి చైర్మన్ కు వినతి పత్రాన్ని అందజేస్తూ తనపై పోలీసులు అక్రమ కేసులు, అట్రాసిటీ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని, కావున తనకు తగిన న్యాయం చేయాలని కోరారు.
ప్రభుత్వ భవనాలు, పథకాలు శంకుస్థాపన కార్యక్రమ శిలాఫలకాలపై మైనారిటీ వర్గాలకు చెందిన పేర్లు రాయడం లేదని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయనగరం జిల్లా భోగాపురం నుండి షేక్ మదీనా సాహెబ్ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ కు దరఖాస్తు సమర్పించారు.
అంగన్వాడి టీచర్లు, వర్కర్ల నియామకాల్లో మైనారిటీలకు అవకాశం కల్పించాలని, వక్ఫ్ బోర్డుకు మౌలిక వసతులతో పాటు ఫర్నిచర్ కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం నుండి జామియా మసీద్ మేనేజ్ మెంట్ కమిటీ అధ్యక్షులు మహిబుల్లా ఖాన్ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సమావేశంలో కమీషన్ వైస్ చైర్మన్ ఎ.జాషువా డేనియల్, రాష్ట్ర మైనారిటీ కమీషన్ సెక్రటరీ దుర్గా ప్రసాద్ సాహు, కమిషన్ సభ్యులు జితేందర్ జిత్ సింగ్, ముస్లింలు, క్రైస్తవులు,సిక్కులు, జైనులు, పారసీల సంఘాల ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు