ఇండియా కూటమి కుల, మతపరమైనది
ఉత్తరప్రదేశ్‌లో 7వ దశ ఎన్నికల ప్రచారంలో విపక్షాలపై ప్రధానమంత్రి విమర్శలు
జూన్ 4న మరోసారి మోదీ సర్కారు కొలువుదీరడం ఖాయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇప్పటికే ముగిసిన ఆరు దశల ఎన్నికల పోలింగ్‌లో దేశం ఈ మేరకు నిర్ణయించిందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ-ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సదుద్దేశాలు, విధానాల కారణంగా బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి ఏర్పాటు చేయాలని దేశం నిర్ణయించుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇండియా కూటమి మతపరమైనదిగా, కులపరమైనదిగా దేశం అర్థం చేసుకుందని ప్రధాని మోదీ ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకుగానూ రాజ్యాంగాన్ని మార్చాలని వారు నిర్ణయించుకున్నారని మోదీ ఆరోపించారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానమంత్రులు ఉంటారని, అలాంటి ప్రధానులు దేశాన్ని బలోపేతం చేయగలరా అని ప్రధాని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఓటు బ్యాంకుకే పరిమితమయ్యారని, అయితే మోదీ మాత్రం దేశంలోని పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాలకు అంకితం అయ్యారని పేర్కొన్నారు.
మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేందుకు ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగాన్ని మారుస్తాయని, దేశంలోని మెజారిటీ కమ్యూనిటీని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చాలని భావిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ప్రతిపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను అంతం చేసి, వాటిని ముస్లింలకు ఇస్తాయి. ఇండియా కూటమి పార్టీలు వివిధ కులాలను తమలో తాము తన్నుకునేలా చేస్తున్నాయి. ఇండియా కూటమి భాగస్వామ్యం కలిగిన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు కొన్నేళ్లుగా పూర్వాంచల్‌ను నిర్లక్ష్యం చేశాయని, ఈ ప్రాంతాన్ని మాఫియా, పేదరికం, నిస్సహాయ ప్రాంతంగా మార్చాయని ఆరోపించారు.ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు కులాలను బలహీనపరిచేందుకు తమలో తాము కొట్లాడుకునేలా చేస్తున్నాయని, తద్వారా అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్నాయన్నారు. ‘నేను ఇండియా కూటమి చేస్తున్న ఈ భారీ కుట్ర గురించి పూర్వాంచల్, ఘోసీ ప్రజలను అప్రమత్తం చేసేందుకు వచ్చాను ‘ అని మోడీ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి రాత్రికి రాత్రే ముస్లి కులాలను ఓబీసీలుగా ప్రకటిస్తున్నారు. ఇటీవల కలకత్తా హైకోర్టు 77 ముస్లిం కులాలకు ఓబీసీ రిజర్వేషన్లను తిరస్కరించిందని మోడీ పేర్కొన్నారు.