జిల్లా ఎస్పీ కేకేఎన్. అన్బురాజన్
- అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ సూచించారు. శుక్రవారం ఆయన అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ కు వివిధ సమస్యలతో వచ్చిన పిటీషనర్లతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. ఆస్తి పంపకం విషయంలో తమ కొడుకు ఇబ్బంది పెడుతున్నాడని ఓ వృద్ధ దంపతులు ఎస్పీ దృష్టికి తెచ్చారు. విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని త్రీటౌన్ సి.ఐ ధరణీ కిశోర్ ను ఆదేశించారు. పోలీసు స్టేషన్ కు వచ్చే మహిళలు, పిల్లలు, వృద్ధులు, తదితర పిటీషనర్ల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు. ఏమాత్రం జాప్యం చేయవద్దని సూచించారు.అదేవిధంగా రెగ్యులర్ కౌన్సెలింగ్ లో భాగంగా పోలీసు స్టేషన్ కు పిలిపించిన ట్రబుల్ మాంగర్స్ తో మాట్లాడారు. సమస్యలు సృష్టించకుండా బుద్ధిగా జీవించాలని వారికి ఎస్పీ సూచించారు. డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ లలో పట్టుబడిన వారితో మాట్లాడి పలు సూచనలు చేశారు. అనంతరం పోలీసు స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. స్టేషన్ ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వివిధ నేరాలలో సీజ్ చేసిన వాహనాలను త్వరితగతిన డిస్పోజల్ చేయాలన్నారు. రిసెప్సన్ ను మరింత సౌకర్యవంతంగా ఉంచుకోవాలన్నారు. ఆ తర్వాత పోలీసు స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. గ్రేవ్ అండ్ నాన్ గ్రేవ్ యు.ఐ ( అండర్ ఇన్వెస్టిగేషన్ ) కేసుల పరిష్కారానికి కృషి చేయాలని, శివారు కాలనీలలో గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. దొంగతనాలు జరగకుండా నిఘా వేయాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీతో పాటు త్రీటౌన్ సి.ఐ ధరణీకిశోర్ ఉన్నారు.