తక్కువ నీటిని వినియోగించే పంటలనే సాగు చేయాలి
- రైతులకు జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సూచన
- రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి : జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీరు అవసరమయ్యే చిరుధాన్యాలు, అపరాల పంటలను రైతులు సాగు చేయాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సూచించారు. స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, మొక్కజొన్న తదితర పంటలు రైతులు సాగు చేయరాదన్నారు. తక్కువ నీటిని వినియోగించే పంటలను సాగు చేసి నీటిని పొదుపు చేయాలన్నారు. హెచ్ఎల్సీ కెనాల్ నీరు ఆగిపోయిన నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత తక్కువగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సాగునీటికి నీటిని విడుదల చేయడం సాధ్యంకాని పరిస్థితులు ఉన్నాయన్నారు. అందుబాటులో ఉన్న నీటిని వాడుకోవడంలో తాగునీటికీ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రైతులకు కూడా జిల్లా యంత్రాంగానికి సహకారం అందించి నీటిని పొదుపు చేసేలా చూడాలన్నారు. రబీ సీజన్లో బోర్ల కింద అపరాలు, చిరుధాన్యాలు సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి రాగి, కొర్ర, తదితర పంటలు సాగు చేసేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను అన్ని విధాలా ఆదుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిఓనెంబర్.4 ప్రకారం జిల్లాలో 28 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం జరిగిందన్నారు. 28 మండలాల్లో శనివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో పంట నష్టం అంచనా వేసి రైతుల వివరాలు తయారు చేయనున్నమన్నారు. అలాగే 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సామాజిక తనిఖీ నిర్వహించి ఏదైనా ఫిర్యాదులు ఉంటే స్వీకరిస్తామన్నారు. ఈ నెల 26, 27వ తేదీల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి తుది జాబితాను తయారు చేసి వ్యవసాయ కార్యాలయానికి పంపిస్తామన్నారు. ఈ జాబితాను జిల్లా కలెక్టర్ అనుమతితో పంట నష్ట పరిహారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నమన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు ఆలమూరు సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని, ఏదైనా విపత్తు వలన పంట నష్టం జరిగినా వెంటనే అదే సంవత్సరంలో పంట నష్ట పరిహారం, పంటల భీమా ఇచ్చి రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు. రైతుల కోసం వ్యవసాయ సలహా మండలి ఏర్పాటు చేసి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ మార్కెట్ ధరల ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలు సాగు వివరాలు తెలియజేశామన్నారు. అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి జిల్లా వ్యవసాయ సలహా మండలి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. పశుగ్రాసం కోసం ప్రభుత్వ, బంజరు భూముల్లో బోర్లు వేసి గడ్డిని పెంచడం వలన పశుగ్రాసం కొరత నివారించడానికి వీలవుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన పురుగు మందులు, జిప్సం జింక్ మరియు నీటిలో కరిగేటటువంటి ఎరువులను సరఫరా చేయాలని కోరారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు వారి శాఖల పరిధిలో అమలవుతున్న కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఓ అశోక్ కుమార్ రెడ్డి, ఉద్యాన శాఖ డిడి రఘునాథరెడ్డి, ఏపీఎమ్ఐపి పిడి ఫిరోజ్ ఖాన్, హెచ్ఎల్సి ఎస్ఈ రాజశేఖర్, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ దేశేనాయక్, ఎల్డిఎం సత్యరాజ్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, రేకులకుంట ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త సహదేవ రెడ్డి, ప్రోగ్రెసివ్ రైతులు కృష్ణమూర్తి, రామలింగారెడ్డి, ఎపి సీడ్స్ డిఎం ధనలక్ష్మి, మార్కెటింగ్ ఎడి చౌదరి, ఎడిఏలు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సలహా మండలి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.