ఐపీఎల్ 17వ సీజన్ ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే. మే 26న జరిగిన ఫైనల్లో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు 8 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి టోర్నీలో విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ క్రికెట్ లెజెండ్ వసీమ్ అక్రమ్ ఓ ఆసక్తికరమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఐపీఎల్ ఫైనల్ ఆడిన జట్లలో టీ20 వరల్డ్ కప్ కు ఎంపికైన ఒక్క టీమిండియా ఆటగాడు కూడా లేడని వ్యాఖ్యానించారు. అయితే, వరల్డ్ కప్ కు రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన రింకూ సింగ్ ఒక్కడికి మాత్రం మినహాయింపు అని వివరించారు. టీమిండియా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహించిన జట్లన్నీ ఫైనల్ కు ముందే నిష్క్రమించాయి కాబట్టి… తాము బిజీ క్రికెట్ తో అలసిపోయామని చెప్పాల్సిన అవసరం టీమిండియా ఆటగాళ్లకు ఉండబోదని అనుకుంటున్నానని అక్రమ్ తెలిపారు. ఏదేమైనా భారత ఆటగాళ్లకు దూరదృష్టి ఎక్కువేనని పేర్కొన్నారు. ఐపీఎల్ లో ఫైనల్ చేరడం కంటే, దేశానికి ప్రాతినిధ్యం వహించడమే మిన్న అని భావించారని, ఇది ఒకందుకు మంచిదే అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, అమెరికా, వెస్టిండీస్ దేశాల సంయుక్త ఆతిథ్యంలో టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి 29 వరకు జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు టీమిండియా ఆటగాళ్లు విడతల వారీగా అమెరికా చేరుకుంటున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శుభ్ మాన్ గిల్, ఖలీల్ అహ్మద్ లు ఇప్పటికే అమెరికా చేరుకుని ప్రాక్టీసు షురూ చేయగా… యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రింకూ సింగ్ త్వరలోనే అమెరికా చేరుకోనున్నారు. ఇక, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కాస్త ఆలస్యంగా అమెరికాలో అడుగుపెట్టనున్నారు. వరల్డ్ కప్ లో భారత్ తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది. జూన్ 9న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడనుంది.