దుగ్గిరాల జయంతి..
02.06.1889
సురేష్..9948546286
✍️✍️✍️✍️✍️✍️✍️
పేరేమో దుగ్గిరాల..
మనిషేమో అగ్నిజ్వాల..
చీరాల పేరాలను తెల్లోళ్లు
ఏకం చేస్తే
ఊరుకుంటాడా దుగ్గిరాల..
అగ్గి మీద గుగ్గిలమైపోడా..!
ఆ ఉద్యమమే
స్వరాజ్య సంగ్రామంలో
కీలక ఘట్టం
అదిరిపోయింది
బ్రిటీష్ చట్టం!
పుట్టిన మూడో రోజే
అమ్మ పోయిందని..
మూడో ఏటనే
నాన్న కాలం చేసాడని
కలకాలం ఏడుస్తూ ఉండిపోని సాహసి…
సమస్యల సహవాసి..!
తెల్లోడిపై జైత్రయాత్రకు
ముందే చదువులో
డింకీ యాత్ర..
మూడులోనే తప్పిన
పెనుగంచిప్రోలు చిన్నోడు
ఎడింబరో చేరి
ఎమ్మే చేశాడు
తిరిగొచ్చి బడిపంతులై
తన వంతుగా
విద్యాదానం చేశాడు..
నచ్చిన తంతుగా
జనం మెచ్చిన నాటకాలాడాడు!
అలా ఆడుతూ పాడుతూ
ఉన్న గోపాలుడు
అంతలో సమరయోధుడై
చీరాల చీటీ చింపితే..
పేరాల పేరెత్తితే..
ఆ రెంటినీ జత చేస్తే
కత తేలుస్తానన్నాడు..
తెల్లోళ్ళ నల్లగుండెల్లో
నిదరోయాడు..!
అబ్బో..
అలా కనిపిస్తాడు గాని
ఈ దుగ్గిరాలకు
రాని విద్యలేదు..
ప్రతి కళారీతి..ఆయన రీతి..
తోలుబొమ్మలు..జముకులు..
బుర్రకథలు..వీధి నాటకాలు..
సాముగారడీలు.. బట్టబొమ్మలు..
జానపద కళలకు పట్టుగొమ్మలు..!
ఆధ్యాత్మిక సేవలోనూ
రామదండుతో ఓ చేయి..
సమరమైనా..సేవైనా..
గోపాలకృష్ణయ్యది పైచేయి.!