మొగలి శివప్రసాద్,గొల్లప్రోలు
ఎన్నికలు ముగిసి కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండడంతో ఏ పార్టీ తరపున ఏ నాయకుడు ఎంత నొక్కేశాడో లెక్కలు క్రమంగా బయటపడుతున్నాయి. నాయకుల చేతివాటం కారణంగా గెలుపు అవకాశాలు ఉన్న ఒక పార్టీ పోలింగ్ రోజున ప్రత్యర్థి పార్టీ ముందు తేలిపోయింది. కొంతమంది ఓటర్లకు మాత్రమే నోట్లు అందడంతో నోట్లు అందని ఓటర్లు ప్రత్యర్థి పార్టీకి కసిగా ఓట్లు వేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేసిన ఇరు ప్రధాన పక్షాల తరఫున కొన్నిచోట్ల ఇదే తతంగం జరగడంతో ఎన్నికలలో ఎవరు ఎంత పంపిణీ చేశారో అన్న అంశంపై ఆయా పార్టీల నాయకులు లెక్కలు వేస్తున్నారు.
పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఈ నియోజకవర్గానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఎన్నికలలో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇరు పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. అయితే పవన్ ను ఓడించేందుకు అధికార పార్టీ ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు నిధులు సైతం భారీగానే పంపిణీ చేసినట్లు సమాచారం. అధికార పార్టీ ఎన్నికల కోసం ఈ నియోజకవర్గానికి సుమారు 110 కోట్లు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిధుల పంపిణీకి సంబంధించి పై స్థాయి నుండి క్రింది స్థాయి నాయకులకు చేరేటప్పటికి భారీగా కోత పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గంలోని ఒక కీలక నేత భారీగా వెనకేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలింగ్ కు ముందు రోజు తెల్లవారుజామున ఆయా ప్రాంతాలలో ఓటర్లకు పంపిణీ నిమిత్తం ఉంచిన కోట్లాది రూపాయలు తన వద్దకు తెప్పించేసుకోవడంతో ఈ వ్యవహారంపై ఎన్నికల పరిశీలకునిగా విచ్చేసిన నాయకుడు సైతం ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే మిధున్ రెడ్డికి సన్నిహితులమని చెప్పుకునే ఐదుగురు నాయకులు భారీగా సొమ్ములు నొక్కేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఎంపీ అభ్యర్థి సునీల్ తరఫున పని చేస్తున్నామంటూ చీకటి బ్యాచ్ గా వ్యవహరించే ఒక వర్గం నేత భారీగా సొమ్ములు పక్కదోవ పట్టించినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ విజయం కోసం కృషి చేయవలసిన నాయకులే ఈ విధంగా వ్యవహరించడంతో తామేమి తక్కువ తినలేదంటూ చోటామోటా నాయకులు సైతం ఎవరికి అందినంత వారు దోచుకుని ఓటర్ల నోట్లో మట్టి కొట్టినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ హోదాలలోని నాయకులకు, మీడియాకు, వివిధ వర్గాల వారికి చెల్లించినట్లు అకౌంట్లో చూపించి స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. పార్టీకి చెందిన ఒక కీలక నేత బంధువు నుండి వైసీపీ అధిష్టానం సుమారు 2 కోట్ల రూపాయలు రికవరీ చేసిందంటే పార్టీ సొమ్ము ఏమేర పక్కదోవ పట్టిందోనని పలువురు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అలాగే కొంతమంది ఓటర్లకు నోట్లు పంచకపోవడం, కొన్నిచోట్ల తక్కువగా నగదు పంపిణీ చేయడం వంటి అంశాలపై అధిష్టానం రహస్యంగా విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
కూటమి నాయకులదీ అదే తీరు...
కూటమి తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయం సాధించాలన్న లక్ష్యంతో జనసేన పార్టీ సైతం అధికార పార్టీకి దీటుగా ఎన్నికల నిమిత్తంభారీగా నిధులు కేటాయించింది. పార్టీ తరఫున సుమారు 60 కోట్ల రూపాయలు జనసేన కేటాయించగా ఇందులో అధిక భాగం కూటమి తరపున కీలకంగా వ్యవహరించిన ఒక నాయకునికి అందజేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే సదరు నాయకుడు సుమారు 30 కోట్ల రూపాయలు ఓటర్లకు పంచామని మిగిలిన నగదు పలువురు నాయకులు వివిధ వర్గాల వారికి పంచినట్లు లెక్కలు చూపిస్తున్నట్లు ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా జనసేన నాయకులు పర్యవేక్షణ ప్రాంతాలలో ఓటర్లకు నగదు సక్రమంగానే పంపిణీ జరిగిందని కొంతమంది టిడిపి నాయకుల ద్వారా పంచిన ప్రాంతాల్లో మాత్రం సక్రమంగా పంపిణీ జరగలేదని ఆరోపణలు వస్తున్నాయి. పిఠాపురం పట్టణ, మండల పరిధిలోని కొన్ని గ్రామాలలో టిడిపి నేతలు ఓటర్లకు అంతంత మాత్రంగానే పంచి భారీగా సొమ్ములు పక్కదోవ పట్టించినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఒక కీలక నేత నుండి నాయకులకు పంపిణీ జరిగిన 500 రూపాయల నోట్ల కట్టలలో ఒక్కొక్క కట్ట నుండి 5 నుండి 15 నోట్ల వరకు తక్కువగా ఉండటం చర్చనీయాంశం అయింది. అలాగే పవన్ కు మద్దతుగా వచ్చిన కొంతమంది ఎన్ ఆర్ ఐ లు, సినీ నిర్మాతలు అందజేసిన విరాళాలు కూడా కొంతమంది నాయకులు పక్కదోవ పట్టించినట్లు పలువురు విమర్శిస్తున్నారు. కాగా ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నోట్ల పంపిణీ ఎలా జరిగినా కొంత మంది నాయకులు మాత్రం నగదు భారీ మొత్తంలోనే వెనకేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.