లేపాక్షి: మండల కేంద్రమైన లేపాక్షిలో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో తెలుగు యువత ఆధ్వర్యంలో బుధవారం విజయోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా లేపాక్షి భజన మందిరం సమీపంలో కేక్ ను కట్ చేసి నాయకులు కార్యకర్తలకు పంచి పెట్టారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ జయప్ప, నాయకులు ఆనంద్ కుమార్, వెచ్చం సుబ్రహ్మణ్యం, వెచ్చం రవీంద్రనాథ్ ,సూర్య ప్రకాష్, జనసేన మండల కన్వీనర్ బాలాజీ తదితరులను తెలుగు యువత నాయకులు ఘనంగా శాలువలు, పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ జయప్ప మాట్లాడుతూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రచారాలకు సమయం వెచ్చిన్చడం జరిగిందన్నారు. పథకాలు అమలులో కూడా క్రమ పద్ధతి పాటించలేదన్నారు. ఆర్హులైన లక్షలాదిమందికి సంక్షేమ పథకాలు అందించలేని ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఎద్దేవా చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకున్న ప్రజలు ఓటుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పై ఉన్న నమ్మకంతో ప్రజలు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించారని అందుకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నప్ప, మంజునాథ్, ఆవుల రెడ్డి, డైరీ శ్రీ రామప్ప, హోటల్ బసవరాజ్ , జయప్పలతోపాటు పలువురు టిడిపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.