న్యూఢిల్లీ: నేషనల్ డెమోక్రాటిక్ అలయెన్స్ పక్ష నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాని మోడీ నివాసంలో బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏ పక్షాల నేతలు ఎన్నుకున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధాని పీఠంపై కూర్చోనున్నారు. జూన్ 8న ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండి రాష్ట్రపతిని ఎన్డీఏ పక్ష నేతలు కలవనున్నారు. ఈ సందర్భంగా కీలక తీర్మానాలు ఆమోదించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ విధానాల కారణంగా గత పదేళ్లలో దేశంలోని 140కోట్ల మంది ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు. దాదాపు 6 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు ఎన్డీఏ నేతలు చెప్పారు.

మోడీతో నితీశ్ కుమార్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ఐక్యంగా పోరాడి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, మహిళలు, యువత, రైతులు, దోపిడీకి గురవుతున్న, అణగారిన వర్గాలకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ఎన్డీఏ నేతలు స్పష్టం చేశారు. భారతదేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా దేశం సర్వతోముఖాభివృద్ధి కోసం, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బీహార్ సీఎం, జేడీయూ నేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు జాతీయ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్డీయేలో బీజేపీతో పాటు 15 పార్టీలు ఉన్నాయి. టీడీపీ, జేడీఎస్, ఆర్ఎల్డీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, జనసేన, హిందూస్తానీ ఆవామీమోర్చా, అప్నాదళ్, అస్సాం గణపరిషత్, శివసేన(షిండే), అజిత్ పవార్(ఎన్సీపీ), జేడీయూ వంటి పార్టీలు ఉన్నాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం సాయంత్రం జరిగిన ఎన్డీయే సమావేశం తాజాగా ముగిసింది. ఈ సమావేశానికి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఎన్డీయే నేతలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నట్లు తెలుస్తోంది. నేడే నరేంద్రమోడీ, అమిత్ షా, చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ కలిసి రాష్ట్రపతిని కలువనున్నట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతారని తెలిసింది. ఇప్పటికే కొత్త ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతిని కలిసిన మోడీ తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా ఉండాలని ఆమె కోరారు. జూన్ 8న ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయనున్నారు.