Thursday, November 28, 2024

Creating liberating content

సాహిత్యంఅక్షరాల "జర్నీ"లిస్టు..!

అక్షరాల “జర్నీ”లిస్టు..!

✍️✒️✍️✒️✍️✒️✍️

ఆయన రాసేది తక్కువే..
రాయించేది ఎక్కువ..
అలా రాయించేటపుడు జంకడు..
బెదరింపులు రానీ..
ఒత్తిడులు పెరగనీ..
దాడులే జరగనీ…
రాయిలా నిలబడి
రాయిస్తూనే ఉన్నాడు..
అలా అక్షరయాత్ర సాగించి..
అనుకున్నవి ఎన్నో సాధించి..
నిన్న గాక మొన్న కూడా
ఒక మహాక్రతువును ముగించి..
విజయగర్వంతో
అక్షరమాల ధరించి
దివికేగాడు..
మూత పడని ఆ పెన్ను..
అవినీతిపై ఈనాడు పేరిట
ఏనాడో ఎక్కుపెట్టిన గన్ను..!

అక్షరమే ఆయుధమై..
సమాజహితంలో
తానే ఒక సమిధయై..

ఎక్కడో పుట్టినా వార్త.
రామోజీరావు దాని కర్త..
ఆ వార్తకు సంస్కర్త..
కృతిభర్త..!

ఇలా ఉంటే అది వ్యాసమని..
అలా చదవడమే పాఠకుని వ్యాసంగమని..
నిర్వచించి..అదే ప్రవచించి..
అలాగే రాయించి..
పత్రికకి ప్రమాణం
నిర్దేశించిన
చారిత్రక ప్రయాణం..!

నీ ఆసక్తి..నా అనురక్తి..
రామోజీరావు యుక్తి..
తెలుగు భాషకు
ఈనాడు ప్రథమావిభక్తి..!
చదివేవాడికి రక్తి..
ఎందరికో భుక్తి..!

ఈనాడు మూలవిరాట్టు..
ఆధునిక మీడియా సామ్రాట్టు..
పట్టిందే పట్టు..
విడిచిపెడితే ఒట్టు..
పోరాటమే పధం..
అక్షరమే ఆయుధం..
ఈనాడే పాశుపతం..
అదే రామబాణం..
అదే సుదర్శనం..
ప్రతి ఉదయం
సంచలనంతో దర్శనం..
రామోజీ ధైర్యానికి
ఆ పత్రికే నిదర్శనం..!

ఈనాడు
ఒక వ్యసనం..
ఒక శాసనం…
పాఠకుడికి ఏకాసనం..
అధినేతకు సింహాసనం..!_

సామాన్యంగా
మొదలైన
సినిమా ప్రయాణం..
ఉషాకిరణ్..
తిమిర సంహరణాలు..
అదీ ఒక చరిత్రే..
ఆయన సినిమాలూ
అవకరాలకు ప్రతిఘటనే..!

ఫిలిం సిటీ..
రామోజీ కీర్తి కిరీటంలో
మరో కలికితురాయి..
బాలీవుడ్ సైతం చూడని
మరో ప్రపంచం..
హాలీవుడ్ స్థాయి
సంచలనం..
ఇలాంటి ఎన్నో అపురూపాలతో
సదా అద్భుతాలతో
రామోజీరావు కరచాలనం!

సరే..మార్గదర్శి ని పక్కనబెడితే..
పత్రికా రంగానికి
ఆయనే మార్గదర్శి..
అక్షరానికి బలం..
వార్తకు శక్తి..
రాతకు ఉన్నతి..
పత్రికకు గౌరవం..
ప్రచురణకు సాంకేతికత..
పాఠకుడికి ఉత్సుకత..
ఇవన్నీ రామోజీరావు భావుకత..!..

పుట్టుకతో జర్నలిస్టు కాకపోయినా..
తుది శ్వాస వరకు
అక్షరంతోనే ప్రయాణం సాగించిన జర్నీలిస్టు..!

ఈనాడు అధిపతి
రామోజీరావుకు
నివాళి అర్పిస్తూ..

ఎలిశెట్టి సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article