Sunday, January 19, 2025

Creating liberating content

క్రీడలుకోహ్లీపై నమ్మకం ఉంచండి: సునీల్ గవాస్కర్

కోహ్లీపై నమ్మకం ఉంచండి: సునీల్ గవాస్కర్

ఐపీఎల్ 2024లో ఏకంగా 700లకు పైగా పరుగులతో సత్తా చాటి ఆరెంజ్ క్యాప్ గెలిచి… ఎన్నో అంచనాలతో టీ20 వరల్డ్ కప్ 2024కు ఎంపికైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. గ్రూపు దశలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్ కేవలం 1 పరుగు, కీలకమైన పాకిస్తాన్‌పై మ్యాచ్‌లో 4 పరుగులు మాత్రమే చేశారు. ఇక బుధవారం అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో మరీ దారుణంగా డకౌట్ అయ్యాడు. సౌరభ్ నేత్రవల్కర్ బౌలింగ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో విరాట్ కోహ్లీ ఫామ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీ ఫామ్‌పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.దేశం తరపున ఆడుతున్నప్పుడు ఏ ఆటగాడైనా మ్యాచ్‌లు గెలిపించాలని కోరుకుంటాడని కోహ్లీని ఉద్దేశించి గవాస్కర్ అన్నారు. కోహ్లీ చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నాడని, ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడని గవాస్కర్ ప్రస్తావించారు. విరాట్ ఫామ్ విషయంలో కాస్త ఓపిక పట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. టోర్నీ ఆరంభ దశలోనే ఉన్నామని, ఇంకా సూపర్-8, సెమీ-ఫైనల్‌, బహుశా ఫైనల్‌ కూడా ఆడతారని ఆశిద్దామని గవాస్కర్ అన్నారు. అందుకే కోహ్లీ విషయంలో సహనం, నమ్మకం ఉండాలని గవాస్కర్ వ్యాఖ్యానించారు. టీ20 వరల్డ్ కప్ తదుపరి రౌండ్‌లో టీమిండియా ప్రవేశించిన నేపథ్యంలో కోహ్లీ తన మ్యాజికల్ ఫామ్‌ను తిరిగి పొందేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మూడు మ్యాచ్‌ల్లో తక్కువ స్కోర్లు చేసినంత మాత్రాన విఫలమైనట్టుగా భావించాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మంచి బంతులు ఎదురవుతాయి. కాబట్టి కోహ్లీ త్వరగా ఫామ్‌లోకి వస్తాడని మనం ఆశించాలి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article