నేడు రక్తదాతల దినం
హిందీలో ఖూన్..
ఆంగ్లంలో బ్లడ్..
పండితులు చెబితే రుధిరం..
నువ్వూ నేనూ అంటే రక్తం..
ఏ పేరుతో ఎవరు ఇచ్చినా
అది రక్తదానం..
దాని పేరే ప్రాణదానం!
అప్పు చేయిస్తుంది అవసరం..
ఆకలైనప్పుడు
అడుగుతుంది నోరు..
కాని..ఒంటిపై స్పృహే లేని
ఓ జీవుడు..
తన బతుకు నిలబెట్టాలని
నిన్ను అడగలేని స్థితిలో
అటు ఆగని రక్తస్రావం..
నువ్వు ఇచ్చే ఓ లీటరో…
రెండో సీసాల ఎర్రని ద్రవం…
తప్పిపోయే ఉపద్రవం!
నిలబడే జీవితం..
దాని పేరే ప్రాణదానం!!
నువ్వు ఇస్తే తరిగేది కాదు..
తిరిగి చేరేది..
నువ్విచ్చే సీసా..
ఓ కుటుంబానికి కులాసా..
కొందరి భాషలో పుణ్యం..
ఇంకొందరికి బాధ్యత…
మరీ పేదోడికి
ఆ పూట గడిచే అవసరం..
మొత్తానికి రుధిరం
ఇవ్వటమే ప్రధానం..
దాని పేరే ప్రాణదానం!
ఇలా ఇస్తే రుధిరం..
అతి గొప్ప విజయ విహారం..
అదో కర్తవ్యంగా..
బాధ్యతగా..అలవాటుగా..
ఎన్నోసార్లు ఇచ్చే దాతలు..
కలియుగ కర్ణులు..
కీర్తిని మించి స్ఫూర్తి..
ఇవాళ ఉండి
రేపు చెల్లిపోయే ధనం..
జీవితమంతా అవతల
మరో వ్యక్తిలో
అతడి రక్తంతో
కలిసి ప్రవహించే
నీ రక్తం..
తెలియకుండానే ఏర్పడే
ఓ బంధం..
ఎప్పటికీ వీడని
ప్రేమ సుగంధం..
నీ తర్వాత కూడా
అవతల మరో ప్రాణాన్ని
నిలిపి ఉంచే దానం..
దాని పేరే ప్రాణదానం!
🫀🫀🫀🫀🫀🫀🫀
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286