మాటల మూట పుట్టినరోజు
పైనేదో మడ్డర్
జరిగినట్టు లేదూ..
సూరీడు నెత్తుటి
గడ్డలా లేడూ..
ఎప్పుడూ యదవ బిగినెస్సేనా..
మడిసన్నాక కూసంత
కలాపోసన ఉండాల..
ఊరికే తిని తొంగుంటే
మడిసికి..గొడ్డుకి తేడా
ఏటుంటాది..
బాపూ ఏసిన ముత్యాలముగ్గు
ఆయన పెతిభతో మాత్రమే హిట్టయిపోనేదు…
ఎనక రావు గోపాలరావు
సెప్పిన మా గొప్ప మాటలున్నాయి..
అది గోపాల్రావు కెడిట్టే
అంటే జనం ఒప్పుతారా..
ఆ డవిలాగులు
అంత గొప్పగా గీకేసిన
ముళ్ళపూడి రమణ కలం..
అదే పెద్ద కలకలం..
ఆ సినిమాని నిలబెట్టింది
కలకాలం..!
రమణ సిరాతో తడవని
బాపూ బొమ్మ..
సత్తిరాజు కుంచె తడపని
ముళ్ళపూడి మాటల మూట
ఉంటే..మనం కంటే
అది మన చిత్తభ్రమణమే..
ఆ ఇద్దరూ బాపూరమణమే..
ఆ జంట రమణీయమే!
ముళ్ళపూడి మాట
తేట తెనుగు ఊట..
రమణ ప్రాణం
పోసిన బుడుగు
ఇంటింటి చిచ్చరపిడుగు..
ఒక్కసారి చదివితే
మళ్లీ మళ్లీ చదవాలనిపించకపోతే
తెలుగు సాహిత్యాన్ని అడుగు..
నవ్వుల మడుగు..
తెలుగింటి అక్షరాల అరుగు!
బాపూ బొమ్మతో
వెలుగుల జిలుగులు
రంగరించుకున్న వెండితెర
ముళ్ళపూడి నేసిన
మాటల కోకను సోకుగా
సింగారించుకుని
‘మత్యాలముగ్గు’లు వేసిన
థియేటర్ల వాకిళ్ళలో
‘గోరంతదీపం’ వెలుగులో
ఆవిష్కరిస్తూ ‘సంపూర్ణరామాయణం’..
చూసేందుకు
నాటి జనం
అందాలరాముడులా
ముస్తాబై..
మిష్టర్ పెళ్ళాం జతగా..
మనవూరిపాండవులు వోలె
కలిసి మెలిసి తరలి
చూసి మురిసి..కళ్ళు మెరిసి
తరించలేదా..
నిజం..ఇందుకు సెల్యూలాయిడే ‘సాక్షి’..!
అయినా చింపేస్తే చిరిగిపోయేది..
చేరిపేస్తే చేరిగిపోయేది
కాదుగా చరిత్ర!
✍️✍️✍️✍️✍️✍️✍️
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286