కెవి రెడ్డి
పాతాళభైరవి..
తోటరాముడు
రాకుమారిని వరించి మంత్రికుడి వెంట నడిచి
అమ్మోరిని మెప్పించి
వరాలు పొందిన జానపదం..
వసూళ్లలో సరికొత్త పధం!
మాయాబజార్..
శశిరేఖాపరిణయం..
పాండవులు కనిపించని
భారతం..లక్ష్మణకుమారుడి
ఉత్తుత్తి పెళ్లి బాగోతం..
అద్భుతమైన స్క్రీన్ ప్లే..
మహానటుల పవర్ ప్లే..
ప్రపంచ సినిమా
పరమాద్భుతం..!
జగదేకవీరునికధ..
ఐసీ..అబ్బురపరిచే ఫ్యాంటసీ..
విజయావారి
హిట్టు సినిమాల లెగసీ..
దేవకన్యలు..మధురస్వరాలు
ఆటకూటి దెయ్యాలు..
శివశంకరీ శివానందలహరి..
తెర నిండుగా..
కన్నులు పండుగ్గా..
అయిదుగురు నాయకులు..
ఓం ఏకొనేకో హమస్మి..
నందమూరి ధన్యోస్మి..!
సినిమా రీళ్లు కావవి..
కెవి రెడ్డి కాలచక్రాలు..
దర్శకుడు అన్నీ తానై
ఆవిష్కరించిన కళాఖండాలు
విజయావారి కలకండలు..!
సినిమా తీస్తే కెవి రెడ్డిలాగే
తియ్యాలి..అది ఉవాచ…
రామారావే తు.చ.తప్పక
పాటించిన సూత్రం..
పఠించిన పాఠం..
క్లాప్ కొట్టే ముందే
అంతా సిద్ధం…
తారాగణం..నిర్మాత గుణం..
టెక్నీషియన్స్..బడ్జెట్..
అంతా కెవి రెడ్డి
నిర్ణయించుకునే టార్గెట్..
స్క్రీన్ ప్లే పక్కా అయ్యాక
ఒక్క అక్షరం మారిస్తే
మాయాబజార్ మీదొట్టు..
రెడ్డి పట్టిందే పట్టు..
అలాగే హిట్టు కొట్టు..!
అక్కినేనితో టెన్నిస్ ఆడుతున్న ఎన్టీవోడిలో
కనిపించిన ఉక్రోషం..
అతగాడికి ఇచ్చింది
తోటరాముడి వేషం..
అప్పటిదాకా మాంత్రికుడి
విషయంలో మీనమేషం..
రామారావు లుక్స్ కి తగ్గట్టు
ఎస్వీఆర్ ఫిక్స్..
రెడ్డి గారి మహిమ..
పాతాళభైరవితో
తెలుగు సినిమాకి
మహానటుల ఘుమఘుమ!
భక్టపోతన..
బాలయోగిని సమాధికి
పంపిన సినిమారాజం..
చిత్రీకరణలో అడుగడుగునా
కెవి రెడ్డి ఇజం..
జీవించిన నాగయ్య..
తర్వాత అయ్యాడు
తానే ఓ త్యాగయ్య..!
వేమన..పెద్దమనుషులు..
దొంగరాముడు.. శ్రీకృష్ణార్జునాయుద్ధం..
వేటికవే ప్రత్యేకం..
అనంతరం బాధించిన
పరాజయాల భారం..
నందమూరితో మరోసారి
జట్టు కట్టి..
శ్రీకృష్ణసత్యతో హిట్టు కొట్టి
ఆ తృప్తితో
సినిమాలకు సెలవు..
అదే సంతృప్తితో
చాలించినా తనువు..
తన అద్భుతమైన
బొమ్మల కొలువుతో
తెలుగు ప్రేక్షకుల
హృదయాలే శాశ్వత నెలవు!
(ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286)