చంద్రుడిపై పడింది
తొలి అడుగు..!
నాటి పాదముద్రలు
భద్రమేనా జాబిలీ..!
🌕🌕🌕🌕🌕🌕🌕🌕
(ఎలిశెట్టి సురేష్ కుమార్)
9948546286
✍️✍️✍️✍️✍️✍️✍️✍️
చందమామ రావే..
జాబిల్లి రావే..
కుందనపు పైడి కోన
వెన్నపాలు తేవే..
అన్నమయ్య ఇలా
వెన్నపాల కోసం
ఎన్ని విన్నపాలు చేసినా..
అంతటి రామయ్యే ముచ్చటపడినా..
అందిరాని జాబిల్లి
నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కు
పట్టుబడిన వేళ…
జగమంతా ఆనందాల హేల!
ఔను..ఇదే రోజున అమెరికా అంతరిక్ష నౌక అపోలో 11
చంద్రమండలం మీద దిగింది.
ఇది నాసా సాధించిన అపూర్వ విజయం..!
సరిగ్గా జూలై 20వ తేదీ ..
20.17 గంటల(యుటిసి…
కో ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైం..నిజానికి దీనినే 1972కి ముందు గ్రీనిడ్జ్ మీన్ టైం అనేవారు)కు అంతరిక్ష నౌక చంద్రుడిపై దిగింది.అంతకు ముందు చంద్రుడి కక్ష్యలోకి చేరిన నౌక
అంతరిక్షంలోనే రెండుగా
విడి తొలి
అద్భుతాన్ని సాధించిన
కొన్ని గంటల తర్వాత విడివడిన లూనార్ మోడ్యూల్ నౌక చంద్రునిపై దిగింది.
ఇదే నౌక నుంచి
కమాండర్ నీల్ ఆర్మ్ స్ట్రాంగ్
కిందికి వచ్చి ఆ రోజుల్లోనే లక్షలాది మంది ప్రత్యక్ష ప్రసారం ద్వారా కళ్ళప్పగించి చూస్తుండగా
చంద్రుడి మీద
పాదం మోపి
ప్రపంచ మానవాళి ప్రతినిధిగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు.ఆపై సరిగ్గా పందొమ్మిది నిమిషాల తర్వాత లూనార్ మోడ్యూల్ పైలట్ బజ్ ఆల్డ్రిన్
అతనికి జత కలిసాడు.
ఆ ఇద్దరూ కలిసి ఆధునిక మానవుని చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తూ చంద్రుడిపై అడుగు పెట్టడమే గాక మామూలు మనిషి నిలబడడమే సాధ్యం కాని జాబిల్లి
ఉపరితలంపై
రెండు గంటల పదిహేను నిమిషాలకు పైగా విహారం చేశారు.తాము దిగిన ప్రాంతానికి
ట్రాంక్విలిటీ బేస్ గా
నామకరణం చేసిన
ఆర్మ్ స్ట్రాంగ్ తన అపురూపమైన ఆనందాన్ని..
గొప్ప విజయాన్ని
చిన్న మాటలతో
ఇలా వ్యక్త పరిచాడు..
“ఇది చంద్రుడిపై మనిషి వేసిన చిన్న అడుగు. కాని మానవాళి పురోగమనానికి పడిన అద్భుతమైన ముందడుగు..”
అటు తర్వాత చంద్రునిపై
47.5 పౌండ్ల(21.5 కేజీల) మట్టిని సేకరించి తెచ్చారు ఆర్మ్ స్ట్రాంగ్..బజ్..!
మానవుడే మహనీయుడు..
శక్తియుతుడు..యుక్తిపరుడు
మానవుడే మాననీయుడు..
ఈ గీతానికి సంపూర్తిగా వాస్తవ రూపం కల్పిస్తూ మనిషి సాధించిన అపూర్వ విజయమది..!
చంద్రునిపై మనిషి జీవనం..పురాణాల్లో మాత్రమే విన్న కథనం..
ఆధునిక ప్రపంచంలో దానిని సాధ్యం చెయ్యాలన్న అమెరికా కల..అంతకు ఎనిమిది సంవత్సరాల పూర్వం అమెరికా
అప్పటి అధ్యక్షుడు
జాన్ ఎఫ్ కెన్నెడీ
నిర్దేశించిన లక్ష్యం..1969..జూలై 20 న అంతరిక్ష నౌక చంద్రునిపై
దిగడంతో సాకారమై..
ఆ చంద్రుడే మర్నాటికి
ఆర్మ్ స్ట్రాంగ్..
బజ్ ల ప్రాకారమై
మొత్తం ఎనిమిది రోజుల పాటు అంతరిక్ష విహారం తర్వాత అపోలో 11 బోలెడంత వెండి వెన్నెలను మోసుకుని కొలంబియా చేరింది..
ఇప్పటికీ ఆర్మ్ స్ట్రాంగ్ అబ్బురంగా
లిఖించిన తొలి పాదముద్రలు
జాబిల్లిపై భద్రంగా ఉన్నాయి.
వెన్నెలను అందుకోవాలన్న
మనిషి కల..
శాస్త్రమే శస్త్రమై..
లక్ష్యమే బ్రహ్మాస్త్రమై..
సాధించిన విజయం..
మానవాళి పురోగతికి
మహోదయం..!