Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుషమీ జీవితంలో క్లిష్ట దశ గురించి పంచుకున్న స్నేహితుడు ఉమేశ్ కుమార్

షమీ జీవితంలో క్లిష్ట దశ గురించి పంచుకున్న స్నేహితుడు ఉమేశ్ కుమార్

టీమిండియా మేటి బౌలర్లలో షమీ కూడా ఒకడు. వరల్డ్ కప్ టోర్నీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం తారాపథంలో ఉన్నప్పటికీ కొన్నేళ్ల క్రితం వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. షమీతో విడిపోయాక అతడి భార్య గృహ హింస కేసు పెట్టడం, మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించడంతో అతడు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్టు అతడి స్నేహితుడు ఉమేశ్ కుమార్ తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పేర్కొన్నాడు. ఒకానొక దశలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాడని చెప్పుకొచ్చాడు. ‘‘అప్పట్లో షమీకీ అన్నీ ప్రతికూలంగా మారాయి. పరిస్థితులకు ఎదురీదాడు. నాతోనే ఉండేవాడు. మ్యాఛ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తడం ఆ తరువాత దర్యాప్తు కూడా ప్రారంభం కావడంతో అతడు కుమిలిపోయాడు. ఏదైనా భరించగలను కానీ దేశద్రోహం చేశానన్న నిందను మాత్రం భరించలేనని చెప్పాడు. అతడు ఏదో తీవ్ర నిర్ణయం తీసుకోబోయాడన్న వార్తలు కూడా వచ్చాయి. ఆ రోజు నేను తెల్లవారుజామున 4 గంటలకు మంచినీళ్లు తాగేందుకు గదిలోంచి బయటకు రాగా, షమీ బాల్కనీ వద్ద నిలబడి కనిపించాడు. మా ఫ్లాట్ 19వ అంతస్తులో ఉంది. ఏం జరుగుతోందో నాకు అప్పుడు అర్థమైంది. షమీ జీవితంలో ఆ రాత్రి చాలా సుదీర్ఘమైంది. ఆ తరువాత ఓ రోజు మేము ఏదో విషయంపై మాట్లాడుతుండగా తనకు ఓ మెసేజ్ వచ్చింది. దర్యాప్తులో అతడికి క్లీన్ చిట్ వచ్చిందని దాని సారాంశం. ఆ రోజు అతడు వరల్డ్ కప్ గెలిచిన దానికంటే ఎక్కువ సంతోషపడి ఉంటాడు’’ అని చెప్పుకొచ్చాడు. తన కష్టాల గురించి షమీ కూడా ఓసారి మీడియాతో పంచుకున్నాడు. జీవితంలో ముందుకెళ్లాలంటే తమ ప్రాధాన్యాలు ఎమిటో ఎవరికి వారు నిర్ణయించుకోవాలని చెప్పాడు. అవతలి వారి ఆరోపణలు అవాస్తవాలని తెలిసినప్పుడు పట్టించుకోకుండా ముందుకు సాగాలన్నాడు. ఈ రోజు తానీ స్థితికి వచ్చి ఉండకపోతే తన ఒడిదుడుకుల గురించి మీడియా సహా ఎవరికీ ఆసక్తి ఉండేది కాదని చెప్పుకొచ్చాడు. జీవితంలో పోరాడుతూనే ఉండాలని చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article