• ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టేది మీరే
• రాష్ట్ర పునర్నిర్మాణానికి ఈ కలెక్టర్ల సదస్సు ఎంతో కీలకం
• రాష్ట్ర పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
• పాలనలో పారదర్శకత, నాణ్యత ప్రమాణాలు పాటించండి
• ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాల్సింది కలెక్టర్లే
• పెన్సన్ల పంపిణీలో మీరు చూపిన చొరవ అభినందనీయం
• కలెక్టర్ల సదస్సు ప్రారంభోత్సవంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ పనితీరును, ప్రతిష్టను ఇనుమడింపజేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపైనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ అన్నారు. సచివాలంయలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేత్రుత్వంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రారంభోత్సవ ఉపన్యాసం చేశారు. ఇప్పుడు నిర్వహిస్తున్న ఈ సదస్సు అత్యంత కీలకమైంది, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో కీలకమైందన్నారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతూ ప్రభుత్వ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాల్సిన బాధ్యత అంతిమంగా జిల్లా కలెక్టర్లదే అన్నారు. రాబోయే 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించిందని, దాన్ని కలెక్టర్లు సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయడంలో సమస్యల పరిష్కారంలో బాధ్యతాయితంగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఒకవేళ మీ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే వాటిని ఆయా విభాగాల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో జిల్లా కలెక్టర్లు చూపిన చొరవను అభినందిస్తున్నానని చెప్పారు. పెన్షన్ల పంపిణీలో కలెక్టర్లంతా యంత్రాంగంతో ఎంతో సమన్వయంతో సంఘటితంగా పనిచేసి విజయవంతంగా పెన్షన్లు పంపిణీ చేశారన్నారు. ఇదే చొరవ స్ఫూర్తిని మిగిలిన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా చూపాలని సూచించారు. రాబోయే వంద రోజుల ప్రణాళిక జిల్లాలు ఒక సఫలీకృతమై ప్రగతిపథంలో పరిఢవిల్లేలా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తున్నట్లు నీరభ్ కుమార్ ప్రసాద్ అన్నారు.