భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌పై పారిస్ ఒలింపిక్స్ లో చివరి నిమిషంలో అనర్హత వేటు పడింది. వినేశ్ మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఇవాళ రాత్రి ఫైనల్‌లో పోటీ పడాల్సి ఉంది. దీంతో నిర్వాహకులు ఆమె బరువును చూశారు. ఆ సమయంలో వినేశ్ 100 గ్రాములు అదనపు బరువుతో ఉన్నట్టు గుర్తించారు. దాంతో ఆమెపై ఒలింపిక్ కమిటీ, రెజ్లింగ్ కమిటీ అనర్హత వేటు వేశాయి.
అయితే, మంగళవారం రాత్రి నాటికి వినేశ్ ఫోగాట్ నిర్ణీత 50 కిలోల కన్నా 2 కేజీలు అదనపు బరువు ఉన్నారు. దాంతో వెయిట్ తగ్గేందుకు ఆమె జాగింగ్, స్కిప్పింగ్, సైక్లింగ్ చేశారు. ఇక కోచ్, ఇతర స్టాఫ్ ఆమెతో పాటు రాత్రంతా నిద్రాహారాలు మానేసి వినేశ్ అదనపు బరువు తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు. చివరికి ఆమె శరీరం నుంచి కొంత రక్తాన్ని తొలగించారు. అలాగే జుట్టు కూడా కత్తిరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఈవెంట్‌కు ముందు 100 గ్రాముల బరువు అధికంగా ఉండటంతో అనర్హత వేటు పడింది. దీంతో మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 50 కిలోల విభాగంలో ఫైనల్స్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.