భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రెజ్లింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. “కుస్తీ నాపై గెలిచింది…. నేను ఓడిపోయాను.. నన్ను క్షమించు… మీ కల.. నా ధైర్య విచ్ఛిన్నమైంది. ఇక నాకు ఇంకా పోరాడే బలం లేదు. మీ అందరికీ రుణపడి ఉంటాను” అంటూ ఎక్స్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ రిటైర్మెంట్ నిర్ణయం దేశవ్యాప్తంగా అభిమానులను, క్రీడా ప్రముఖులను షాక్‌కు గురిచేసింది. ఆమె ఓ ఎమోషనల్ ట్వీట్ ద్వారా తన ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. పారిస్ ఒలింపిక్స్‌లో ఫైనల్లోకి చేరిన మొదటి భారత రెజ్లర్‌గా చరిత్ర సృష్టించినప్పటికీ, చివరకు 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండటం కారణంగా అనర్హురాలిగా తేల్చడం ఆమెకు బాధ కలిగించింది.ఈ అనుకోని పరిణామం ఆమెపై తీవ్ర ప్రభావం చూపించడంతో రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఆమె ‘కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్’కు ఫిర్యాదు చేసి, తాను రజత పతకానికి అర్హురాలినని పేర్కొంది. తీర్పు రాకముందే రిటైర్మెంట్ నిర్ణయించడం ఆమె అభిమానులను నిరాశపరచింది.ఈ పరిణామం వినేశ్ ఫోగాట్ తన పోరాటానికి గర్వంగా నిలిచినప్పటికీ, ప్రస్తుతం ఆమెకు అవసరమైన మద్దతు, సానుభూతి అందించడం అవసరం. ఆమె భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాలకు అందరూ అండగా ఉండాలి.