రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు
దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ
ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం
9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన
స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి
గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళిక
పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం
గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
మంగళగిరి:-
ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం. దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నామ’ని ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయనున్నారని తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నామన్నారు. దీనిద్వారా మొత్తం 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన దేశంలో ఎన్నడూ లేనట్లుగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చిచేందుకు మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గురువారం మంగళగిరిలోని ఆయన ప్రైవేట్ క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘దేశంలోనే పంచాయతీ వ్యవస్థను మొదలు పెట్టిన రెండో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి మూడు దశాబ్దాలు దాటింది. రెండో తరం సంస్కరణలతో పంచాయతీల నలుదిశల విప్లవం మన రాష్ట్రం నుంచే ఇప్పుడు మొదలుపెడుతున్నాం. గత మూడు దశాబ్దాలుగా పంచాయతీలకు జాతీయ పండుగల నిర్వహణకు మైనర్ పంచాయతీలకు రూ.100, మేజర్ పంచాయతీలకు రూ.250 ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మనం తీసుకొస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా మైనర్ పంచాయతీలకు రూ.10 వేలు, మేజర్ పంచాయతీలకు రూ.25 వేలు నిధులను పెంచి పంచాయతీలకు అండగా ఉంటామని భరోసాను ఇచ్చాం.పంచాయతీ సంస్కరణలు కొనసాగింపులో భాగంగా ఈ నెల 23వ తేదీన గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామసభ అంటే ఏదో తూతూ మంత్రంగా చేయడం కాకుండా పంచాయతీలోని వారంతా కలిసి కూర్చొని గ్రామాభివృద్ధి మీద నిర్ణయాలు తీసుకునేలా నిర్వహిస్తాం. మన గ్రామాలను మనమే పరిపాలించుకుందాం అనేలా వీటి నిర్వహణ ఉంటుంది. భారతదేశపు మూలాలు, జీవం పల్లెల్లోనే ఉంటుందని మహాత్మా గాంధీ చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్ర పంచాయతీలను స్వయంశక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. పంచాయతీలకు ఉండే అధికారాలను గ్రామాల అభివృద్ధికి ఉపయేపడేలా చేసి… పూర్తి స్థాయిలో గ్రామాల ముఖ చిత్రం మార్చుకునేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. • విశాఖపట్నం జిల్లాలో ఆనందపురంలో పూలు ప్రసిద్ధి. అరకులో అరకు కాఫీకు ప్రత్యేకత ఉంది. మంగళగిరి చీరలు, సత్యసాయి జిల్లాలో లేపాక్షి, బాపట్లలో వేటపాలెం గ్రామం, కృష్ణాజిల్లాలో చిలకలపూడి, కొండపల్లి హస్త కళలకి ప్రసిద్ధి. ఇలాంటివి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. వాటి ప్రత్యేకతలను గ్రామ సభల్లో గుర్తించి, నిర్ణయించి వాటిని ప్రమోట్ చేయాలని భావిస్తున్నాం. తయారు చేసే విశిష్టమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఎగుమతులు చేసి సంపద సృష్టించే మార్గాలను అన్వేషిస్తాం. గ్రామసభలకు యువత, మహిళలు విరివిగా పాల్గొవాలి. పంచాయతీల్లో మహిళలు ఎక్కువగా పాల్గొవాలని కోరుకుంటున్నాను. * పంచాయతీల ఆదాయం పెంచేలా సామాజిక అడవుల పెంపకంపంచాయతీల్లో చాలా భూమి నిరు పయోగంగా ఉంటోంది. దాన్ని క్రమ పద్ధతిలో వినియోగించుకోవాలి. స్వచ్ఛ భారత్ ను మరో మెట్టు ఎక్కించేలా గ్రామ పంచాయతీల్లో ఓ ప్రణాళిక ప్రకారం ఎక్కడా చెత్త లేకుండా క్లీన్, గ్రీన్ గ్రామాలుగా తయారు చేసేలా దృష్టిపెడుతున్నాం. డెన్మార్క్ అనే చిన్నదేశం నుంచి కలపను మన దేశం అధికంగా దిగుమతి చేసుకుంటోంది. రూ.6 వేల కోట్ల విలువైన కలపను ఏటా దిగుమతి చేసుకుంటున్నాం. ఇంత మొత్తం విదేశీ మారక ద్రవ్యం కేవలం కలప కోసం ఇంత వెచ్చిస్తున్నాం. గ్రామ పంచాయతీలకు సంబంధించి వృథాగా ఉన్న స్థలంలో సామాజిక అడవి విభాగంలో కలపను పెంచాలని భావిస్తున్నాం. దీని ద్వారా పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. నరేగా పనులను అటవీ శాఖకు అనసంధానం ఉంది. మూగ జీవాలకు నీటి వసతి కల్పించేలా గుంతలను తవ్వడం వంటి వాటికి ఉపయోగిస్తాం. గ్రామాల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేసే ఆలోచన చేస్తున్నాం. ముఖ్యంగా గ్రామాలకు వెళ్లి అక్కడున్న ప్రత్యేకతలను తిలకించేలా పర్యాటకులను ప్రొత్సహిస్తాం.అచ్యుతాపురం ఎసెన్షియా సంస్థలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం. వరుసగా పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎసెన్షియా ఫాక్టరీలో రక్షణ చర్యలు చేపట్టడంలో ఆ పరిశ్రమలకు చెందిన ఇద్దరు యజమానుల మధ్య ఉన్న వ్యక్తిగత గొడవలు కూడా ఓ కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. ఫాక్టరీల్లో సేఫ్టీ ఆడిట్ చేయడం మీద దృష్టి పెడతాం. సేఫ్టీ ఆడిట్ అంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి ఉంది. అందుకే పారిశ్రామికవేత్తలతో ఒకసారి కూర్చొని మాట్లాడదామని, తీసుకుంటున్న రక్షణ చర్యలు వివరించాలని కోరుతాను. ఇప్పటికే హిందూస్తాన్ షిపింగ్ యార్డు వారితో ఒకసారి మాట్లాడాను. మీరు తీసుకుంటున్న రక్షణ చర్యలు చెప్పాలని కోరితే, వారు బాగానే తీసుకుంటున్నాం అని చెబుతున్నారు కానీ పూర్తి భద్రత ఇవ్వాలనేది ప్రాథమిక బాధ్యత. సేఫ్టీ ఆడిట్ ను కఠినంగా అమలు చేస్తే పారిశ్రామికవేత్తలు భయపడతారని, వారు ముందుకు రారని చెబుతున్నారు. అయితే పరిశ్రమలు కచ్చితంగా అక్కడి పనిచేసే వారికి కనీస రక్షణ పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పరిశ్రమల్లో రక్షణ అంశం మీద నేనే ప్రత్యేకంగా దృష్టి పెడతాను. ఈ నెల చివర్లో విశాఖపట్నంలో ప్రత్యేకంగా దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా విశాఖపట్నంలో రోజురోజుకీ కాలుష్యం పెరుగుతోంది. దీన్ని అరికట్టడంపై దృష్టి పెడతాం. పరిశ్రమల కాలుష్యం మీద నిరంతర నిఘా ఉండేలా, ప్రమాదాలను పూర్తిగా అరికట్టేలా శాశ్వత పరిష్కారం చూడాలి’’ అన్నారు.