న్యూఢిల్లీ:వామపక్ష దిగ్గజం, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన… ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా సీతారాం ఏచూరి ఆగస్టు 19న ఎయిమ్స్ లో చేరారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ వస్తోంది. ఎయిమ్స్ వైద్యులు ఆయనకు వెంటిలేటర్ అమర్చి చికిత్స అందిస్తున్నారు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కల్పకం, సర్వేశ్వర సోమయా జులు ఏపీలోని కాకినాడకు చెందినవారు. చెన్నైలో పుట్టిన సీతారాం ఏచూరి హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో ఆయన ఢిల్లీ వేదికగా చురుగ్గా పాల్గొన్నారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరారు. ఆ మరుసటి ఏడాది సీపీఐ (మార్క్సిస్ట్) పార్టీలో చేరారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన జేఎన్ యూ విద్యార్థిగా ఉన్నారు. ఆ సయయంలో ఆయనను కూడా అరెస్ట్ చేశారు. సీతారాం ఏచూరి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే… మొదటి భార్య పేరు ఇంద్రాణి మజుందార్. ఆమె ప్రముఖ విద్యావేత్త, వామపక్ష కార్యకర్త, స్త్రీవాద ఉద్యమకారిణి వీణా మజుందార్ కుమార్తె. ఇక, ప్రముఖ మహిళా జర్నలిస్టు సీమా చిస్తీని సీతారాం ఏచూరి రెండో వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం కాగా… ఒక కుమార్తె ఎడింబరో వర్సిటీలో ఫ్రొఫెసర్. ఓ కుమారుడు పాత్రికేయుడు కాగా, మరో కుమారుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఉమ్మడి ఏపీకి సీఎస్ గా వ్యవహరించిన మోహన్ కందా… సీతారాం ఏచూరికి మేనమామ అవుతారు.