Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్తిరుమల వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తామంటే కుదరదు: చంద్రబాబు

తిరుమల వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తామంటే కుదరదు: చంద్రబాబు

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్ మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలకు సీఎం చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి బదులిచ్చారు. ఏ వ్యక్తి అయినా తిరుమల వచ్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తామంటే కుదరదు అని తేల్చి చెప్పారు. ఇష్టం లేకపోతే తిరుమల వెళ్లొద్దు… ఇష్టముంటే వెళ్లండి… వెళ్లినప్పుడు అక్కడి సంప్రదాయాలు పాటించి ఆలయంలోకి వెళ్లండి… అని స్పష్టం చేశారు. నన్ను అడగడానికి మీరెవరు? అంటే… అడుగుతున్నది నేను కాదు… తిరుమలలో రూల్స్ ఆ విధంగా ఉన్నాయి… ఆ రూల్స్ లో ఉన్నది పాటించి తీరాలి… అని ఉద్ఘాటించారు. “తిరుమల వెళ్లొద్దని జగన్ కు ఎవరూ చెప్పలేదు. తిరుమల వెళ్లొద్దని జగన్ కు ఎవరైనా నోటీసులు ఇచ్చారా? ర్యాలీలు, జనసమీకరణలు చేయవద్దని మాత్రమే చెప్పాం. తిరుమల వెళ్లినప్పుడు అక్కడి నియమనిబంధనలను, ఆగమశాస్త్ర ఆచార సంప్రదాయాలను పాటించాలని చెప్పాం. అలాంటివి పాటించకపోతే మనోభావాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది.ఇవాళ అతను మాట్లాడిన మాటలు చూస్తే… నేను వెళతాను అంటున్నాడు. నేను అనుభవంతో చెబుతున్నా… ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు. ఇంతకుముందు కూడా వెళ్లాను… ఇప్పుడు కూడా అలాగే వెళతాను అంటున్నాడు… ఇంతకుముందు నిబంధనలు అతిక్రమించావు… ఇప్పుడు కూడా నిబంధనలు మళ్లీ అతిక్రమించాలా? ఇంతకుముందు మీరు చట్టాన్ని ధిక్కరించి, బెదిరించి ఆలయం లోపలికి వెళితే, అది శాశ్వత అధికారం అవుతుందా? చట్టాలను చేసే శాసనసభ్యులుగా మనం చేసిన శాసనాలనే మనం గౌరవించకపోతే, ప్రజలెందుకు గౌరవిస్తారు? దౌర్జన్యం చేస్తాం, రౌడీయిజం చేస్తాం అంటే కుదరదు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని చెబుతున్నాడు. బయటికి వెళితే హిందూ మతాన్ని గౌరవిస్తానని కూడా చెబుతున్నాడు. గుడ్… గౌరవించడం అంటే ఏమిటి… ఆ ఆలయానికి వెళ్లినప్పుడు ఆ ఆలయ సంప్రదాయాలను పాటించడం, అక్కడుండే ఆచారాలను అమలు చేయడం, అక్కడి నియమనిబంధనలు ఉల్లంఘించకపోవడం. అలా కాకుండా… ఇప్పటిదాకా నన్నెవరు ఇలా అడగలేదు, ఇప్పుడెందుకు అడుతున్నారు అనడం సమంజసం కాదు. బైబిల్ చదువుతున్నావు అంటే దానిపై నీకు నమ్మకం ఉంది కాబట్టి. అందులో తప్పులేదు. బైబిల్ రూంలోనే ఎందుకు చదువుకోవాలి, బయట కూడా చదువుకోవచ్చు కదా! నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు… నేను సూటిగా అడుతున్నా… నమ్మకం ఉన్నప్పుడు చర్చికి ఎందుకు పోకూడదు? నాలుగ్గోడల మధ్యన చదువుకోవడం ఎందుకు? ప్రజలందరూ ఆలోచించాలి. నేను హిందువుని… వెంకటేశ్వరస్వామి వద్దకు వెళతాను. నేను బహిరంగంగానే పూజలు చేస్తాను. అలాగే చర్చికి వెళతాను… వాళ్ల నియమాలను, నిబంధనలను పాటిస్తాను. మసీదుకు వెళతాను… వాళ్ల ఆచారాలను గౌరవిస్తాను. సొంత మతాన్ని ఆచరిస్తాం… మత సామరస్యాన్ని కాపాడతాం. ఇందులో తప్పేమీ లేదే! అలాంటప్పుడు బైబిల్ ను లోపలే చదువుకోవడం ఎందుకు… బహిరంగంగానే చదువుకోవచ్చు కదా! లోపల కూర్చుని చదువుకోవడాన్ని నేను తప్పుబట్టడంలేదు. కానీ, లోపల మాత్రమే చేస్తాను, బయట మాత్రం చేయను, నాది మానవత్వం అని మాట్లాడుతున్నాడు. మతసామరస్యాన్ని కాపాడమంటే, మానవత్వం అంటావేంటి? అందుకే పాబ్లో ఎస్కొబార్ అనేది. ఎస్కొబార్ అరాచకాలు బయటికి వస్తుంటే, ఇలాంటివి కూడా జరుగుతాయా అని ఆశ్చర్యం వేస్తుంది. ఎస్కోబార్ కు, ఇతడికి పోలికలు చూసుకోండి. ఇటీవల సంఘటనలన్నీ ఎస్కోబార్ తరహాలోనే ఉంటున్నాయి” అంటూ చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. “ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు… అతడు ఆ పార్టీకి జనరల్ సెక్రటరీ అంట. అతనొక అడ్వొకేట్ (పొన్నవోలు). పంది మాంసం బంగారం… నెయ్యి రాగి అంటున్నాడు… బంగారం తీసుకువచ్చి రాగిలో కలుపుతారా అంటున్నాడు. మనోభావాలు అంటే లెక్కలేదా మీకు? ఈ విషయాన్ని కనీసం ఖండించారా మాజీ ముఖ్యమంత్రి గారూ? అతడు మీ పార్టీ జనరల్ సెక్రటరీ అవునా, కాదా? మీ వాళ్లు ఏం మాట్లాడినా మేం భరించాలా? మీకు బాధ్యత లేదా? ఈ విషయాలే నేను అడుగుతున్నా… ప్రజలను కూడా పరిగణనలోకి తీసుకోమని చెబుతున్నా. ఆలయాలను అపవిత్రం చేసే చర్యలను అడ్డుకునే బాధ్యత మేం తీసుకుంటాం… అందులో ఎలాంటి రాజీ లేదు” అని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇందులో దళితులను ఎందుకు లాగుతావ్ జగన్!: సీఎం చంద్రబాబు ఆగ్రహం

తిరుమల వెళ్లాల్సిన మాజీ సీఎం జగన్ అనూహ్య రీతిలో పర్యటన రద్దు చేసుకోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అయింది. అంతేకాదు, పర్యటన రద్దు అనంతరం జగన్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా కూటమి పార్టీల నేతల్లో ఆగ్రహావేశాలు కలిగించాయి. ఒక మాజీ సీఎంనే తిరుమల ఆలయంలోకి రానివ్వకపోతే, ఇక దళితుల పరిస్థితి ఏంటి? అని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. నువ్వు తిరుమల గుడికి వెళ్లకుండా, ఇందులోకి దళితులను ఎందుకు లాగుతున్నావని జగన్ ను సూటిగా ప్రశ్నించారు. “దళితులను తిరుమల ఆలయంలోకి రానివ్వబోమని ఎవరు చెప్పారు? దళితులను ఆలయంలోకి అనుమతించడంలేదా? తిరుమల ఆలయానికి వెళ్లకుండా, కావాలనే ఇలా బురద చల్లుతున్నావు. ఈ విధంగా చేయడం ఇతడికి బాగా అలవాటైంది. ఇతనికి రాజకీయాల్లో విశ్వసనీయత లేదు. తిరుమల వెళ్లడం అతడికి ఇష్టం లేదు… వెళితే సంతకం పెట్టాలి… సంతకం పెట్టడం ఇష్టం లేదు… సంతకం పెట్టకుండా దౌర్జన్యం చేయాలి… కానీ ఇప్పుడు దౌర్జన్యం చేసే వీల్లేదు… కాబట్టి తిరుమల వెళ్లడం, వెళ్లకపోవడం అనేది మీ సమస్య. ఇందులోకి దళితులను ఎందుకు లాగుతున్నారు?” అని చంద్రబాబు విమర్శనాస్త్రాలు సంధించారు. “అతడు చెప్పేవన్నీ అబద్ధాలే. జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తే తనకు నోటీసులు ఇచ్చాడని చెబుతున్నాడు. నిన్ను తిరుమల వెళ్లవద్దని నోటీసులు ఇచ్చారా? నిన్ను వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లనివ్వబోమని ఎవరన్నా వచ్చి చెప్పారా? వీళ్లు ఇలాగే అబద్ధాలు చెబుతున్నప్పుడు మేం ఖండించకపోతే, వీళ్లు చెప్పే అబద్ధాలనే నిజం అనుకుంటారు” అని చంద్రబాబు పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article