-నివాళులర్పించిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం
హిందూపురం టౌన్ :విప్లవ నాయకుడు సర్దార్ భగత్ సింగ్ జయంతి వేడుకలు శనివారం హిందూపురంలో ఘనంగా జరిగాయి. సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలీ మాట్లాడుతూ, భగత్ సింగ్ జీవితం నేటి యువతరానికి, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. భగత్ సింగ్ అతి చిన్న వయసులోనే దేశభక్తిని అణువణువునా నింపుకొని దేశ స్వాతంత్య్రం కోసం , సమసమాజ స్థాపన కోసం పోరాటం చేశారన్నారు. వలస పాలకులు జరిపిన జలియన్ వాలాబాగ్ మారణకాండ ఆయన్ను 12 సంవత్సరాల ప్రాయంలోనే సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడేందుకు కారణమైందన్నారు. సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కరపత్రాలు విసిరి పొగ బాంబులు వేసి విప్లవం వర్ధిల్లాలి అని నినదిస్తూ పారిపోకుండా పోలీసులకు దొరికిపోయారని, తరువాత భగత్ సింగ్ కు ఆయన సహచరులైన సుఖ్ దేవ్ ,రాజ్ గురు లకు మరణశిక్షను విధించటం జరిగిందని, మరణశిక్షను 1931వ సంవత్సరం మార్చి 23వ తేదీన లాహోర్ జైలులో అమలు చేశారన్నారు. ఈ విధంగా భగత్ సింగ్ తన 23 ఏళ్ల జీవితకాలంలో భగత్ సింగ్ చేసిన పోరాటం, చూపిన తెగువ, పట్టుదల, సమాజం పట్ల ప్రేమ, బాధ్యతలు వంటి అంశాలు నేటి యువతకు ఎంతో స్ఫూర్తినిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శికుమార్, అభి, చరణ్ ,భగత్, రాంప్రసాద్, గణేష్, ప్రభుదేవు, హరీష్, గిరీష్, భానుప్రసాద్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.