అమరావతి :- మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన వివిధ వర్గాల ప్రజలు, దివ్యాంగులు, విద్యార్థులతో పాటు సాయం కోసం వచ్చిన వారి సాధకబాధకాలను సీఎం ఓపిగ్గా విన్నారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పలువురు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించారు. వినతుల స్వీకరణకు ముందు గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గుంటూరు పట్టణం, గోరంట్లకు చెందిన తన్నీరు సామ్రాజ్యం అనే దివ్యాంగురాలు తన సమస్యను చెప్తూ….తనకు ఎప్పటి నుండో దివ్యాంగురాలి కోటాలో పెన్షన్ వస్తోందని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ 300 యూనిట్లుకు పైగా వినియోగించామన్న కారణంతో పెన్షన్ తొలగించారని మొరపెట్టుకున్నారు. జీవనం సాగించడం కష్టంగా ఉందని, తిరిగి తన పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. పల్నాడు జిల్లా, పమిడిమర్రు గ్రామానికి చెందిన గుర్రపుశాల శ్రీనివాసరావు అనే వైసీపీ బాధితుడు మాట్లాడుతూ….తన తండ్రి వారసత్వంగా అన్నదమ్ములిద్దరికీ రెండెకరాల చొప్పున భూమి ఉందని, గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఆ భూమిని ఆక్రమించి, దొంగ పట్టాలు సృష్టించారని ఫిర్యాదు చేశారు. పొలం విషయమై సదరు నేతలను అడగ్గా తమపై దాడికి యత్నిస్తున్నారని వాపోయారు. కృష్ణధర్మ రక్షణ సమితికి చెందిన హిందూ పెద్దలు సీఎంను కలిశారు. గుంటూరు, విజయవాడ జాతీయ రహదారి మధ్య సంరక్షణ లేని గోవుల అక్రమ రవాణా జరుగుతోందని దీన్ని అరికట్టేందుకు మంగళగిరి సమీపంలో గోశాలను ఏర్పాటు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి తుళ్లూరుకు చెందిన ఆలూరి వెంకటరావు, ఆలూరి ఆదినారయణ రూ.50 వేల చొప్పున విరాళం అందించారు. ఎమ్.శ్యామలారావు రూ.25 వేలు, కె.రాజేశ్వరి అనే మహిళ రూ.25 వేలు, విజయనగరానికి చెందిన కె.హారిక రూ.15 వేలు విరాళం అందించారు. వీరిని సీఎం చంద్రబాబు అభినందించారు.