ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇది కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధారాలు లేకుండా మీడియాతో ఈ విషయంపై మాట్లాడటం సరికాదని సుప్రీం ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు, కనీసం దేవాలయ అంశాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని సీరియస్‌గా సూచించింది.విచారణలో టీటీడీ తరఫు న్యాయవాది, జూన్ నుంచి జులై వరకు లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యి ట్యాంకర్ల వివరాలను వెల్లడించారు. ఫిర్యాదుల నేపథ్యలో ఏఆర్ ఫుడ్స్ ట్యాంకర్లను పరీక్షకు పంపారని, రిపోర్టుల ఆధారంగా లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్టు నిర్ధారణకు వచ్చారని తెలిపారు.అయితే సుప్రీంకోర్టు, కేవలం ఒక ల్యాబ్‌లోనే పరీక్షించడం సరిపోదని, ఘజియాబాద్, మైసూర్ వంటి ఇతర ల్యాబ్‌లలో కూడా నెయ్యి శాంపిల్స్ పరీక్ష చేయించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కల్తీ జరిగినట్లు ఎలా ప్రకటించారో ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3కి వాయిదా వేసింది.