తిరుమల :తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఉన్న సమాచారాన్ని సీఎం చంద్రబాబు చెప్పారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు బయల్దేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎక్కడా అనలేదని అన్నారు. నెయ్యి వచ్చిన తేదీల విషయంలో కొద్దిగా అయోమయం ఉందని వారు చెప్పారని పేర్కొన్నారు. దీనిపై తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ‘ప్రాయశ్చిత్త దీక్ష అనేది కేవలం లడ్డూ కోసం చేసిన దీక్ష మాత్రమే కాదు. శాశ్వత పరిష్కారం కోసం చేపట్టిన దీక్ష. సనాతన పరిరక్షణ బోర్డు ఉండాలని కోరుకుంటున్నా. గత ఐదేళ్లలో అనేక తప్పిదాలు జరిగాయి. కొన్నేళ్లుగా 219 ఆలయాలు ధ్వంసం చేశారు. రామతీర్థం ఆలయంలో ధ్వంసం జరిగింది. ప్రభుత్వం అన్నింటిపైనా విచారణ జరిపిస్తుంది.’ అని పవన్ పేర్కొన్నారు. కాగా, మంగళవారం సాయంత్రం తిరుమలకు చేరుకోనున్న పవన్ కాలినడకన శ్రీవారి ఆలయానికి చేరుకుంటారు. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడో ఒక చోట ఆలయాల అపవిత్రతకు పరిస్థితులు దారి తీశాయి. తమ కూటమి ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా అటువంటి చర్యలకు పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే దానిపై ప్రాథమిక ఆధారాలు లేకుండా సీఎం చంద్రబాబు నేరుగా ఎలా ప్రకటన చేస్తారంటూ సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అలాగే దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై స్పందించిన పవన్ . కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. న్యాయస్థానం ముందున్న సమాచారం ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేసిందని తాను భావిస్తునట్లు తెలిపారు.గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఉల్లంఘనలు ఆలయాల విషయంలో చాలా జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం వాటిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి అన్ని చర్యలు తీసుకుంటుందని, అలాగే దాదాపు 219 ఆలయాలను అపవిత్రం చేసినట్లు తెలిపారు. కాగా తాను దీక్ష చేపట్టడంపై పవన్ స్పందిస్తూ.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ముందుకు తీసుకువెళ్లాలనే దీక్ష చేపట్టారన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అవసరం ఇప్పుడు చాలా ఉందని, ఆ బోర్డు ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. ఆలయాల పరిరక్షణకై ప్రత్యేక వ్యవస్థ ఉండాలన్నారు. తాను ఈ దీక్షను పూర్తి చేసిన తర్వాత, డిక్లరేషన్ చేస్తామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.