రాజ్యసభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి
తాడిపత్రి: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చేది గోరంతయని – ప్రజలతో లాక్కునేది కొండంతగా ఉందని, మట్టి ముంత ప్రజలకు ఇచ్చి – వెండి చెంబు ప్రజలతో లాకున్నట్టు రాష్ట్రంలో కూటమి పాలనా తీరు సాగుతుందని రాజ్య సభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి ఎద్దేవా చేశారు. స్థానిక రోడ్లు & భవనాల అతిధి గృహంలో
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నర్రెడ్డి తులసి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది గోరంత కాగా ప్రజలనుండి లాక్కున్నది కొండంతయని ద్వజమెత్తారు.
ఉచిత గ్యాస్ పథకం క్రింద ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్నది, ఏడాదికి రూ 2684 కోట్లు కాగా, కరెంటు సర్దుబాటు చార్జీల పేరుతో ప్రజల నుండి ముక్కు,చెవులు పిండి లాక్కుంటున్నది రూ 6,073 కోట్లుయని తెలిపారు.
ఇంతటితో ఆగకుండా త్వరలో సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం మరొకసారి రూ 11,826 కోట్ల అదనపు భారం ప్రజలపై మోపబోతోందన్నారు.
ఉచిత గ్యాస్ పథకం కూడా పాక్షికంగానే అమలవుతోందన్నారు.
ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి పార్టీలు హామీ ఇచ్చాయని,
రాష్ట్రంలో 180 లక్షల కుటుంబాలు ఉన్నాయనీ,
రాష్ట్రంలో 154 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని.
కానీ 108 లక్షల గ్యాస్ కనెక్షన్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తోందన్నారు.
సూపర్ 6 పథకాలలో చాలా మటుకు అమలు కావడం లేదన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసే లేదన్నారు.
నిరుద్యోగ భృతి అతీగతీ లేదన్నారు.
తల్లికి వందనం నిల్ – తండ్రికి ఇంధనం ఫుల్ అన్నట్లుందన్నారు.
అన్నదాత సుఖీభవ పథకం – అన్న దాత దుఃఖీభవ పథకంగా తయారయిందన్నారు.
మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్టు షాపులు అన్నట్లు మద్యం పాలసీ తయారయిందన్నారు.
ఉచిత ఇసుక పాలసీ పథకం ఉత్తుత్తి పథకంగా తయారయిందన్నారు.
మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఇంటికీ ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సరఫరా ఖచ్చితంగా చేయాలన్నారు.
కరెంటు సర్దుబాటు చార్జీలు ఉపసంహరించాలన్నారు.
సూపర్ 6 హామీలను వెంటనే అమలు చేయాలన్నారు.
బెల్టు షాపులు అరికట్టాలన్నారు.
ప్రజలకు సరసమైన ధరకు ఇసుకను అందుబాటులోకి తేవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందని నర్రెడ్డి తులసిరెడ్డి, డిమాండ్ చేశారు. ఈసమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి ధరణి రాగిపాటి నజీర్ అహమ్మద్, అసెంబ్లి సమన్వయకర్త గుజ్జల నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాసులు, నరసింహా రెడ్ది, అమర్, ఉత్తన్న, రాజు, రమణ పాల్గొన్నారు.