పోరుమామిళ్ల:గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థుల సౌకర్యార్థం జడ్పీహెచ్ఎస్ ఇ.రామాపురం నందు సుమారు రూ.15లక్షల వ్యయంతో భోజనశాల నిర్మించిన దాత డా॥జి.కాశిరెడ్డి దాతృత్వం స్ఫూర్తిదాయకమని ఎంఇవో ఎస్.మస్తాన్ వళి, ఎస్టీయు రాష్ట్ర అదనపుప్రధానకార్యదర్శి పి.రమణారెడ్డి పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖలో సహాయ సంచాలకులుగా పనిచేస్తూ,పదవీవిరమణ చెందిన డా.గొంగళ్ రెడ్డి కాశిరెడ్డి సహకారంతో సుమారు రూ.15లక్షల వ్యయంతో నిర్మించిన భోజనశాల ప్రారంభోత్సవాన్ని శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్.కమాల్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్న మస్తాన్ వళి,రమణారెడ్డిలు మాట్లాడుతూ,వృత్తిరీత్యా ఇతర రాష్ట్రాలలో స్థిరపడినప్పటికీ తాను పుట్టిపెరిగిన ప్రాంతంలో పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలు ఉన్నత విద్యావంతులుగా అభివృద్ధి చెందాలన్న ఒక గొప్ప ఆలోచనతో బృహత్తర కార్యక్రమానికి చేయూతనందించిన దాత కాశిరెడ్డి అభినందనీయుడన్నారు. ఇలాంటి వారు రామాపురం ప్రాంతంలో పుట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు.ఈ భోజనశాల నిర్మాణం కారణంగా విద్యార్థులు మట్టినేలపై, చెట్లకింద,వరండాలలో భోజనం చేసే ఇబ్బందులు తొలిగాయన్నారు. ఇలాంటి దాతలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామీణ ప్రాంతాలలోని విద్య,వైద్యం అభివృద్ధికి దాతలు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దాత డా॥ జి. కాశిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతం విద్యాపరంగా అభివృద్ధి చెందాలనే తపనతో ఈ కార్యక్రమానికి సహకారం అందించానన్నారు. భవిష్యత్తులో గ్రామ అభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి మరింత సహకారం అందిస్తానన్నారు.
మాజీ జడ్పీటీసీ సభ్యుడు నందిగారి వెంకటసుబ్బారెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ వి.నరసింహారెడ్డిలు మాట్లాడుతూ ఈ హాల్ విద్యార్థుల భోజనశాలగానే కాకుండా సమావేశ మందిరంగానూ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుటకు గానూ ,స్టడీ అవర్స్ నిర్వహించుకొనుటకు ఉపయోగ పడుతుందన్నారు.కన్న తల్లిదండ్రులను కూడా కొంతమంది పట్టించు కోకుండా నడిరోడ్డుమీద పడవేసే ప్రస్తుత పరిస్థితులలో తను పుట్టిన ఊరి అభివృద్ధికి ఇంత గొప్ప తోడ్పాటు అందిస్తున్న దాత కాశిరెడ్డి ఔదార్యం వెలకట్టలేనిదన్నారు.ఇదే స్ఫూర్తితో పాఠశాల ఆటస్థలాన్ని అభివృద్ధి చేసి,విద్యార్థులకు ఉపయోగపడేలా తమ సహకారం అందిస్తామన్నారు.తదనంతరం పాఠశాల అభివృద్ధికి సహకరించిన దాతలు జి.కాశిరెడ్డి,నందిగారి వెంకటసుబ్బారెడ్డి లను హెచ్ యం,ఉపాధ్యాయులు శాలువా, పూలమాల,మెమొంటోలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటయ్య,ఎస్ ఎం సీ ఛైర్మన్ సి.తులసి,రిటైర్డ్ డైటీషియన్ నాలి క్రిష్ణారెడ్డి,ఎస్టీయు నాయకులు యు.సుబ్రమణ్యం,వాకా చంద్రశేఖర్,బాలరాజు,బి.సుబ్బారెడ్డి,శేఖర్ బాబు,సత్యనారాయణ, వి.వి.క్రిష్ణారెడ్డి,వెంకటరెడ్డి,ప్రసాద్,మూల రామక్రిష్ణారెడ్డి, దాత బంధువులు పల్లె ఓబుల్ రెడ్డి, ఉమామహేశ్వరరెడ్డి,టీచర్ రామక్రిష్ణారెడ్డి,గంగసాని వెంకటరెడ్డి,గొంగళ్రెడ్డి వెంకటరెడ్డి, ఉపాధ్యాయులు కె.శ్రీనివాసులు, సత్యనారాయణ, బ్రహ్మారెడ్డి, రవికుమార్,తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాత జి.కాశిరెడ్డి పాల్గొన్నవారికి, విద్యార్థినీ విద్యార్థులందరికీ తిథిభోజనం ఏర్పాటు చేశారు.