మండల విద్యాశాఖ అధికారి-2 సిహెచ్ నరేంద్ర రాయ్.
బుట్టాయగూడెం. గ్రంథాలయాలు సామాజిక విజ్ఞాన, సమాచార కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని బుట్టాయగూడెం మండల విద్యాశాఖ అధికారి-2 సిహెచ్. నరేంద్ర రాయ్ అన్నారు. స్థానిక శాఖ గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ వారోత్సవాలు ప్రారంభానికి ముఖ్య అతిథిగా హాజరైన నరేంద్ర రాయ్ బాలల దినోత్సవం సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రంధాలయాలను ఉపయోగించుకొని నిరంతరం విజ్ఞానాన్ని సంపాదించుకోవాలన్నారు. విద్యార్థులు నూతన అంశాలను నేర్చుకోవడంతోపాటు, విద్యావంతులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి గ్రంధాలయాలు సహకరిస్తాయన్నారు. గ్రంథాలయాలలో ఎన్నో విలువైన పుస్తకాలు, డిజిటల్ సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. గ్రంథాలయాధికారిణి ఎస్. రామలక్ష్మి మాట్లాడుతూ ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వారోత్సవాలలో విద్యార్థులకు పుస్తక ప్రదర్శన, వక్తృత్వ, క్విజ్, చిత్రలేఖనం, పాటల పోటీలు తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలలో సభ్యత్వం తీసుకుని, గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పడాలని రామలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అభివృద్ధి కమిటీసభ్యులు, వివిధ ప్రభుత్వ,ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.